సాక్షి, మంచిర్యాల జిల్లా: మద్యం, గంజాయి, డ్రగ్స్.. మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దంటూ ఓ గ్రామం ఒక్కటైంది. తమ గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని మహిళలు, యువత నడుం బిగించారు. ఈ మేరకు ఏకంగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఆదర్శంగా నిలిచారు. గ్రామ ప్రజలంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు చూసినట్లయితే.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లింగంపల్లి గ్రామంలోని ప్రజలు మద్యపాన నిషేధంపై గ్రామంలోని మహిళలు, యువత భారీ ర్యాలీ నిర్వహించారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేశారు. అలాగే, గ్రామంలో మద్యం అమ్మినా, గుడుంబా తయారు చేసినా, విక్రయించినా రూ.10 వేల జరిమానా విధించాలని ఏకగ్రీవంగా వారు తీర్మానించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మత్తు పదార్థాల విక్రయాలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యువత భవిష్యత్తును కాపాడటంతో పాటు కుటుంబాల ఆనందమే లక్ష్యంగా గ్రామస్తులంతా ఒక్కటై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. దీంతో ఆ గ్రామంలోని యువత, మహిళలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, వారి డిమాండ్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన!


