సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అండాల సేకరణ రాకెట్ దర్యాప్తు ముమ్మరమైంది. తొలుత వ్యభిచార ముఠాగా భావించి రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి. ఈ దందాపై సీపీ సుమతి గురువారం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఒక నెట్‌వర్క్‌పై పోలీసులు నిఘా పెట్టారు. ప్రాథమికంగా ఇది వ్యభిచారానికి సంబంధించిన కేసుగా భావించి దాడులు చేశారు. లోతుగా దర్యాప్తు జరిపిన కొద్దీ అసలు భాగోతం బయటపడింది. అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ సాగుతున్న చట్టవిరుద్ధ అండాల సేకరణ రాకెట్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తెలంగాణలో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి అని సీపీ సుమతి పేర్కొన్నారు.
హార్మోనల్ ఇంజెక్షన్ల గుట్టు తేలాలి
బాధిత మహిళల నుంచి అండాలను సేకరించడానికి నిందితులు వారికి భారీగా హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచి్చనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనా స్థలం నుంచి కీలకమైన హార్మోనల్ ఇంజెక్షన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అయితే బాధిత మహిళలపై ఈ ఇంజెక్షన్లను ప్రయోగించారా లేదా అనేది ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక వస్తేనే స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని సీపీ తెలిపారు. సరోగసీ, ఐవీఎఫ్ విధానాల్లో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) సెంటర్లకు, ఫెర్టిలిటీ సెంటర్లకు చట్టబద్ధంగా వేర్వేరు బాధ్యతలు ఉంటాయని సీపీ సుమతి స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో కొన్ని ఏఆర్‌టీ సెంటర్ల ద్వారానే బాధితులతో సంప్రదింపులు జరిపినట్టు విచారణలో ప్రాథమికంగా గుర్తించామన్నారు. దీనిపై లోతైన విచారణ కొనసాగుతోందని చెప్పారు.
తల్లి కావాలనుకునే వారు ఆలోచించాలి
పిల్లలు లేని దంపతులు ముఖ్యంగా తల్లి కావాలని ఆశపడే మహిళలు బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారే తప్ప, ఆ బిడ్డ కోసం అండాలను ఎలా సేకరిస్తున్నారు? ఎక్కడి నుంచి తెస్తున్నారు? అనే చట్టపరమైన అంశాలను పట్టించుకోవడం లేదని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కాకుండా ఇలాంటి అక్రమ మార్గాల్లో అండాలు సేకరించడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు అత్యంత పారదర్శకంగా సాగుతోందని సీపీ సుమతి వెల్లడించారు. ‘విచారణలో ఎవరి పాత్రకు సంబంధించి సరైన ఆధారాలు లభిస్తాయో, వారిని మాత్రమే నిందితులుగా చేర్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని స్పష్టం చేశారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు.


