రూ.81.12 లక్షల విద్యుత్ సర్‌చార్జీ మినహాయింపునకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ చెల్లించాల్సిందేనని స్పష్టీకరణ
మార్గదర్శి పిటిషన్ కొట్టివేత
డాల్ఫిన్ హోటల్స్ పిటిషన్ కూడా చెల్లదన్న న్యాయమూర్తి
రూ.3.85 కోట్లు చెల్లించాల్సిందేనని జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, డాల్ఫిన్ హోటల్స్ లిమిటెడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన వినియోగదారులకు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ (సీఎస్‌ఎస్) చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వలేమని పేర్కొంది. మార్గదర్శి రూ.81,12,110, డాల్ఫిన్ హోటల్స్ రూ.3,85,02,564 బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతితో విద్యుత్ ఉత్పత్తి సంస్థ నుంచి విద్యుత్ పొందినట్లు నిరూపించే చెల్లుబాటయ్యే అనుమతి పత్రాన్ని సమర్పించలేకపోయినందున మినహాయింపు కోరే అర్హత లేదని తేల్చిచెప్పింది.
2005–06 నుంచి 2014–15 వరకు విద్యుత్ వినియోగానికి సంబంధించి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) జారీ చేసిన డిమాండ్ నోటీసులను సమర్థించింది. విద్యుత్ సరఫరా చట్టం కింద ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసిన సందర్భాల్లో మాత్రమే క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. కేవలం ప్రోత్సాహక ఉత్తర్వుల ఆధారంగా ఈ మినహాయింపు కోరడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక గురువారం తీర్పు వెలువరించారు. బకాయిలు చెల్లించాలంటూ ఎస్‌పీడీసీఎల్ జారీ చేసిన డిమాండ్ నోటీసులు, దానిని సమర్థిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మార్గదర్శి, డాల్ఫిన్ హోటల్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు.
పదేళ్ల విద్యుత్ వినియోగానికి బకాయిలు
మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ హెచ్‌టీ వినియోగదారుగా 450 కేవీఏ కాంట్రాక్టు డిమాండ్‌తో విద్యుత్ పొందుతోంది. 2003, ఏప్రిల్ నుంచి 2014 జూన్ వరకు సుధా ఆగ్రో అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థ నుంచి కూడా విద్యుత్ సరఫరా పొందింది. ఈ నేపథ్యంలో 2005–06 నుంచి 2014–15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ కింద రూ.81.12 లక్షలు చెల్లించాలంటూ ఎస్‌పీడీసీఎల్ 2025, జనవరి 31న డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఇదే అంశంపై రూ.3.85 కోట్లు చెల్లించాలని 2025, జూన్ 16న ‘డాల్ఫిన్స్’ కు నోటీసులిచ్చింది. దీనిపై మార్గదర్శి, డాల్ఫిన్ హోటల్స్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా, వాటిని పరిశీలించిన అనంతరం అదే ఏడాది విద్యుత్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ ఆ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.
విద్యుత్ చట్టం–2003 అమల్లోకి రాకముందు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ విధానం లేదని మార్గదర్శి తరఫు న్యాయవాదులు వాదించారు. అమల్లోకి వచ్చిన తర్వాత తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఎలక్ట్రిసిటీ (రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్) సెకండ్ ఆర్డర్ జారీ చేసిందని, దాని ప్రకారం క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ నుంచి తమకు మినహాయింపు వర్తిస్తుందన్నారు. విద్యుత్ సంస్థ.. దీన్ని వ్యతిరేకించింది. 1997, 1998లో జారీచేసిన జీవోలు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు, మూడో వ్యక్తులకు విద్యుత్ విక్రయించే సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించినవేనని తెలిపారు. వాటిని అప్పటి విద్యుత్ సరఫరా చట్టం కింద ప్రభుత్వం జారీ చేసిన సమ్మతిగా పరిగణించలేమన్నారు.
క్రాస్ సబ్సిడీ చార్జెస్ అంటే...
మన దేశంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు వ్యవసాయానికి, పేదలకు లేదా గృహ వినియోగదారులకు తక్కువ ధరకు కరెంట్ అందిస్తుంటాయి. ఈ సబ్సిడీల భారాన్ని భరించడానికి పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి ఎక్కువ టారిఫ్‌లు వసూలు చేస్తాయి. వీరు చెల్లించే అధిక మొత్తంతోనే సబ్సిడీలు నడుస్తాయి. అయితే, ఈ పెద్ద పరిశ్రమలు స్థానిక డిస్కంల నుంచి కరెంట్ కొనకుండా, బయట ప్రైవేట్ నుంచి లేదా ఇతర మార్గాల ద్వారా నేరుగా విద్యుత్తును కొనుగోలు చేస్తే, స్థానిక డిస్కంలకు రావాల్సిన అధిక ఆదాయం కోల్పోతుంది. ఈ విధంగా పెద్ద వినియోగదారులు బయట నుంచి కరెంట్ కొనుగోలు చేయడంతో డిస్కం నష్టపోయే క్రాస్–సబ్సిడీ ఆదాయాన్ని భర్తీ చేయడానికి, ఆ వినియోగదారులపై విధించే అదనపు చార్జీనే క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ అంటారు.
అనుమతి పత్రం సమర్పించడంలో విఫలం
వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక.. విద్యుత్ సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1997లో జీవో 93, 1998లో జీవో 112 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా సంప్రదాయేతర ఇంధన వనరుల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు ఇతర వినియోగదారులకు విద్యుత్ విక్రయించుకునే అవకాశం కల్పించింది. అయితే, ఈ జీవోలు కేవలం ప్రోత్సాహక ఉత్తర్వులుగానే పరిగణించాలి తప్ప.. ప్రభుత్వం ఇచ్చిన చట్టబద్ధమైన అనుమతులుగా భావించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది.
క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ మినహాయింపు పొందాలంటే విద్యుత్ ఉత్పత్తి సంస్థకు సంబంధిత చట్ట నిబంధన కింద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే అనుమతి ఉందని నిరూపించాల్సిన బాధ్యత వినియోగదారుడిపైనే ఉంటుందన్నారు. వ్యక్తిగత విచారణ సమయంలో సంబంధిత అనుమతి పత్రాలను సమర్పించేందుకు మార్గదర్శి అదనపు సమయం కోరినా.. వాటిని విద్యుత్ సంస్థకు గానీ, హైకోర్టుకు గానీ అందించలేకపోయిందని గుర్తు చేశారు. గతంలో ఇదే అంశంపై వచ్చిన తీర్పులు కూడా మార్గదర్శి వాదనకు మద్దతుగా నిలవవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థ జారీ చేసిన డిమాండ్ నోటీసులు, తదనంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ మార్గదర్శితో పాటు డాల్ఫిన్ హోటల్స్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేశారు.


