కదలకుండా కూర్చుంటే కష్టాలే! | Sedentary lifestyle slows down blood circulation in legs | Sakshi
Sakshi News home page

కదలకుండా కూర్చుంటే కష్టాలే!

Nov 6 2026 6:14 AM | Updated on Nov 6 2026 6:14 AM

Sedentary lifestyle slows down blood circulation in legs

కాళ్లలో మందగించనున్న రక్త ప్రసరణ 

యువతకు ‘డీవీటీ’ప్రమాదం

సాక్షి స్పెషల్‌ డెస్క్‌: గేమింగ్, ఓటీటీ వినోదం కాస్తా నేడు యువత ప్రాణాల మీదకు వస్తోంది. గంటల తరబడి ఒకేచోట కదలకుండా కూర్చోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం తీవ్రంగా పెరుగుతోంది. కాళ్లలో రక్త ప్రసరణ మందగించి డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌ (డీవీటీ) సమస్య తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు ప్రస్తుతం యువత జీవితంలో విడదీయలేని భాగమయ్యాయి. ఆ¯న్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ గంటల తరబడి సమయం గడపడం, ఓటీటీలో ఒకదాని తర్వాత మరొకటి వెబ్‌ సిరీస్‌ ఎపిసోడ్లు చూడటం నేడు సాధారణమైపోయింది. 

మధ్యలో చిన్న విరామం తీసుకోవడం కూడా చాలామంది మర్చిపోతుండటంతో ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చుంటున్నారు. ముఖ్యంగా ఎక్కువసేపు కదలకుండా కూర్చున్నప్పుడు కాళ్ల కండరాల కదలిక తగ్గి, రక్త ప్రసరణ మందగించి సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా జె¯న్‌జీ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగులు, గేమర్లు, ఎక్కువ దూరం ప్రయాణించేవారు ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

డీప్‌ వెయిన్‌థ్రాంబోసిస్‌ అంటే? 
డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌ (డీవీటీ) అనేది శరీరంలో లోతైన సిరల్లో, ముఖ్యంగా కాళ్లలో రక్తం గడ్డకట్టే పరిస్థితి. ఈ గడ్డ కారణంగా రక్త ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడి, కాలి వాపు, నొప్పి, ఎర్రబడటం, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ రక్తపు గడ్డలో కొంత భాగం విడిపోయి ఊపిరితిత్తులకు చేరితే పల్మనరీ ఎంబాలిజం అనే అత్యంత ప్రమాదకర ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది.

అందుకే డీవీటీని సాధారణ కాళ్ల నొప్పిగా భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. డీవీటీ అనేది కేవలం వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే సమస్య అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ వాస్తవానికి యువతలోనూ ఇప్పుడు ఈ సమస్య కనిపిస్తోంది. ఎక్కువసేపు కదలకుండా ఉండటం, అధిక బరువు, ధూమపానం, కుటుంబంలో రక్తం గడ్డకట్టే సమస్యల చరిత్ర, గతంలో డీవీటీ రావడం, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోవడం వంటి అంశాలు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. 

గుర్తించాల్సిన ప్రధాన లక్షణాలు 
డీవీటీ వచ్చినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఒక కాలులో అకస్మాత్తుగా వాపు రావడం, ముఖ్యంగా పిక్క భాగంలో నొప్పి లేదా పట్టేసినట్లు అనిపించడం, కాలి చర్మం ఎర్రగా లేదా రంగు మారడం, ప్రభావిత ప్రాంతం వేడిగా అనిపించడం, నడిచేటప్పుడు లేదా నిలబడినప్పుడు నొప్పి పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా కాలి వాపు, నొప్పితోపాటు అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి, రక్తంతో కూడిన దగ్గు లేదా మూర్ఛ వంటి లక్షణాలు ఉంటే అది ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డ ఏర్పడినట్లు సూచిస్తుంది. కాబట్టి తక్షణ అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. 

జీవనశైలిలో మార్పులు అవసరం 
ఈ సమస్యను నివారించడంలో జీవనశైలి మార్పులు కీలకపాత్ర పోషిస్తాయి. గేమింగ్, ఓటీటీ చూడటం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ, వాటి మధ్యలో శరీరానికి కదలిక కల్పించాలి. ప్రతి గంటకోసారి కురీ్చలో నుంచి లేచి కొద్దిసేపు నడవడం, కూర్చున్నప్పుడే పాదాలను పైకి కిందికి కదిలించడం, కాలి మడమలను పైకి లేపి దించడం చేయాలి. అలాగే ఎక్కువసేపు కాళ్లు ముడుచుకుని కూర్చోకుండా తగినంత నీరు తాగడం, రోజువారీ నడక లేదా వ్యాయామానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రతి గంట నుంచి రెండు గంటలకు ఒకసారి వాహనం ఆపి నడవాలి. 

వైద్య చికిత్సలో నిర్లక్ష్యం తగదు 
డీవీటీని నిర్ధారించడానికి వైద్యులు సాధారణంగా డాప్లర్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్షను, అవసరాన్ని బట్టి ఇతర రక్త పరీక్షలను సూచిస్తారు. రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారణ అయితే వైద్యుల పర్యవేక్షణలో మందులు ఇస్తారు. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ శారీరక శ్రమను తగ్గిస్తోంది. అందుకే యువత తమ డిజిటల్‌ అలవాట్లలో చిన్న మార్పు లు చేసుకుంటూ, వినోదంతోపాటు శారీరక కదలికకూ సమాన ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యకరమై న జీవనశైలిని సొంతం         చేసుకోవాలి.

నడక లేదా వ్యాయామం చేయాలి 
డీవీటీ అనేది వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్య. కాళ్లలోని లోతైన సిరలోŠల్‌ రక్తం గడ్డకట్టే ప్రమాదకర పరిస్థితి. ముఖ్యంగా నేటి యువతలోనూ కనిపిస్తుండటం ఆందోళనకరం. అందుకే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. గంటల తరబడి మొబైల్, కంప్యూటర్‌ ముందు కూర్చోవడం తగ్గించాలి. 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు. సరైన వైద్య చికిత్స చేయించుకోవాలి.  
– డా. నాగే‹Ùకుమార్‌గౌడ్, ఎండీ ఈఆర్‌ ఫిజీషియన్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement