‘లడ్డూ’ విచారణలో అనుమానాలు ఉంటే రండి | Supreme Court on the Tirumala Laddu Prasadam ghee issue | Sakshi
Sakshi News home page

‘లడ్డూ’ విచారణలో అనుమానాలు ఉంటే రండి

Nov 6 2026 5:50 AM | Updated on Nov 6 2026 5:50 AM

Supreme Court on the Tirumala Laddu Prasadam ghee issue

పిటిషనర్‌కు భరోసా ఇచ్చిన సుప్రీంకోర్టు

ప్రస్తుతం ఈ కేసు విచారణను ఏపీ నుంచి బదిలీ చేయలేమన్న ధర్మాసనం

సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారా? అని ఆరా

రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించిన పిటిషనర్‌ తరఫు న్యాయవాది

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి వ్యవహారం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, సాక్షులు ఏపీలోనే ఉన్నందున విచారణను వేరే రాష్ట్రానికి మార్చలేమని పేర్కొంది. నిష్పక్షపాత విచారణకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, ఒకవేళ విచారణలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు భరోసా ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువరించింది. 

ఏపీలో ఈ కేసు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుందని, అందువల్ల ఈ కేసు విచారణను ఏపీ నుంచి పొరుగు రాష్ట్రానికి మార్చాలని కోరుతూ మహా రాష్ట్రకు చెందిన మల్గంగా మిల్క్‌ అండ్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌ ఎండీ, లడ్డూ కేసులో నిందితుడు అయిన మచీంద్ర శాంతారాం లంకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయ వ్యాఖ్యలు ఈ కేసు విచారణకు ప్రతికూలంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదిక నిర్ధారించకపోయినా ఆరోపణలు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం గతంలో తమ ఆదేశాలతో వారందరినీ మౌనం పాటించేలా చేశామని స్పష్టంచేసింది. తమ ఆదేశాల తర్వాత కూడా వారు అలాంటి వ్యాఖ్యలు చేశారా? అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది దవే బదులిస్తూ.. రాజకీయ వ్యాఖ్యలు కొనసాగుతున్నాయని విన్నవించారు. గతంలో రాష్ట్ర సిట్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు, సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటుచేసింది. ఆధారాలు లేకుండా తిరుమల ప్రసాదంపై రాజకీయ ప్రకటనలు చేయరాదని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement