ప్రజలపైనే టీడీపీ గూండాయిజం | Attacks on YSRCP leaders and agents in several areas of the constituency | Sakshi
Sakshi News home page

ప్రజలపైనే టీడీపీ గూండాయిజం

Nov 6 2026 5:34 AM | Updated on Nov 6 2026 5:34 AM

Attacks on YSRCP leaders and agents in several areas of the constituency

పెట్రోల్‌ బాంబులు, పొగ బాంబులతో గ్రామాల్లో దాడులు

పులివెందుల, తిరుపతి జిల్లా నల్లపురెడ్డిపల్లెలోనూ పెట్రోల్‌ బాంబులతో టీడీపీ గూండాల దాడి

పోలింగ్‌ కేంద్రాలకు ప్రజలు, ఏజెంట్లను రానీయకుండా చేసి రిగ్గింగ్‌కు పాల్పడే పన్నాగం

పులివెందుల నియోజకవర్గం ఎర్రిపల్లెలో పెట్రోల్, పొగ బాంబులతో టీడీపీ దాడులు

భయంతో పరుగులు తీసిన ప్రజలు

నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులు

రాళ్లు, సీసాలతో కొట్టి గాయపరిగిన టీడీపీ మూకలు

నల్లపురెడ్డిపల్లెలోకి తెల్లవారుజామునే 60 మంది టీడీపీ గూండాలు

పెట్రోల్‌ బాంబులు, రాళ్లు విసురుతూ గ్రామంలో స్వైరవిహారం

ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలు

ఏర్పేడు/పెనగలూరు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ రోజున టీడీపీ గూండాయిజం పరాకాష్టకు చేరింది. ఏకంగా పెట్రోలు బాంబులు, పొగ బాంబులతో ప్రజలపైనే దాడికి దిగింది. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నాయకులనే వేటాడిన టీడీపీ.. ఇప్పుడు ప్రజలను కూడా లక్ష్యంగా చేసుకొని, రెండు గ్రామాల్లో భీతావహ వాతావరణాన్ని సృష్టించింది. గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించి, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను, ప్రజలను పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా అడ్డుకొని, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకోవడానికి రిగ్గింగ్‌ చేసుకోవడానికి అధికార కూటమి ఇంతటి దాడులకు తెగించింది. గురువారం తెల్లవారుతుండగానే పెట్రోల్‌ బాంబులతో గ్రామాల్లోని ఇళ్లపై పడింది. 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులను ఉదయం నుంచే టీడీపీ గూండాలు యుద్ధభూమిలా మార్చారు. ఎర్రిపల్లె జెడ్పీటీసీ పోలింగ్‌ కేంద్రం సమీపంలో కర్రలు, పెట్రోల్‌ బాంబులు, పొగ బాంబులతో విరుచుకుపడ్డారు. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలోనూ టీడీపీ గూండాలు పెట్రోల్‌ బాంబులు, రాళ్లతో విరుచుకుపడ్డారు. గూండాల దాడిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ఎర్రిపల్లెలో ఎగసిన మంటలు
వైఎస్సార్‌ జిల్లా పులివెందులను టీడీపీ అరాచక శక్తులు గురువారం ఉదయం నుంచే యుద్ధభూమిలా మార్చాయి. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి గాయపరిచాయి. పులివెందుల మండలం ఎర్రిపల్లె జెడ్పీటీసీ పోలింగ్‌ కేంద్రం సమీపంలో టీడీపీ మూకలు కర్రలు, పెట్రోల్‌ బాంబులు, పొగ బాంబులతో దాడులకు దిగాయి. పెట్రోల్‌ సీసాలు పడ్డ చోట మంటలు ఎగిసిపడ్డాయి. ఓటేయడానికి వచ్చిన వారు ప్రాణ భయంతో పరుగులు తీశారు. 

తుమ్మలపల్లిలో పోలింగ్‌ మొదలైన కొద్ది సేపటికే వైఎస్సార్‌సీపీ కార్యకర్త కృష్ణారెడ్డిపై టీడీపీ వర్గీయులు రాళ్లు, సీసాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అచ్చెపల్లిలో రాళ్లతో దాడి చేశారు. వేముల జెడ్పీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పెద్దముడియం మండలంలో 32, 33 బూత్‌ల దగ్గర బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరవ భాస్కర్‌బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి అరవ శ్రీకళపై దాడి చేశాయి. నందలూరు మండలం పాటూరు 45వ నంబర్‌ బూత్‌ దగ్గరా టీడీపీ మూకలు కర్రలతో దాడులు చేశాయి.

ప్రశాంత పల్లెలో టీడీపీ మంటలు
తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లె ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. అటువంటి పల్లెకు మంటలు పెట్టేందుకు టీడీపీ తెగించింది. ఇక్కడ ఉన్న పోలింగ్‌ కేంద్రంలో రిగ్గింగ్‌ చేసుకునేందుకు పెట్రోల్‌ బాంబులతో దాడికి దిగింది. టీడీపీ గూండాలు గురువారం తెల్లవారుజామునే పెట్రోలు బాంబులు, రాళ్లు, కర్రలతో గ్రామంపై విరుచుకుపడ్డారు. వస్తూనే ఇళ్లపైకి పెట్రోల్‌ బాంబులు, రాళ్లు విసురుతూ భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నాయకులపై దాడి చేశారు. 

పెట్రోల్‌ బాంబులు విసరడంతో గ్రామ రహదారులపై మంటలు చెలరేగాయి. అవి ఇళ్లపై పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత కసిరెడ్డి నరసారెడ్డి తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి.  కామనూరు వెంకటరెడ్డి చేతికి, మెడ దగ్గర గాయాలయ్యాయి. మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. టీడీపీ గూండాల దాడులతో ఓట్లు వేసేందుకు ప్రజలు తొలుత జంకినా, ఆ తర్వాత ఎలాగైనా ఓట్లు వేయాల్సిందే అంటూ భారీగా తరలివెళ్లారు. ప్రశాంతంగా ఉండే పల్లెలో టీడీపీ అల్లర్లకు పాల్పడటంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంలో ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గాన్ని చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement