పర్యావరణ అనుమతులకు పాతర.. నిబంధనలు తుంగలోకి
కృష్ణా నదికి 2–3 కి.మీ బ్లూ–గ్రీన్ జోన్ నిబంధన గాల్లోకి∙వ్యవసాయ భూముల ధ్వంసం
ప్రకృతిని పణంగా పెడితే ముంపు ముప్పు ఖాయం
చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డ భారత వాటర్‌మ్యాన్ డాక్టర్ రాజేంద్రసింగ్
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట రాష్ట్ర ప్రభుత్వ పాలకుల కనుసన్నల్లో ప్రకృతి విధ్వంసం యథేచ్ఛగా సాగుతోందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అభివృద్ధి ముసుగులో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాన్ని, సారవంతమైన పంట పొలాలను కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నారని మండిపడ్డారు.
విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్యావరణ చట్టాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోందన్నారు. పర్యావరణ అనుమతులను బాహాటంగా ఉల్లంఘిస్తూ భవిష్యత్ తరాల జీవన భద్రతను తీవ్ర ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి 2015లో రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణ శాఖ మంజూరు చేసిన అనుమతులను ఇష్టారాజ్యంగా తుంగలో తొక్కేస్తున్నారని చెప్పారు. రాజేంద్రసింగ్ ఇంకా ఏమన్నారంటే..
నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమించేస్తున్నారు..
పర్యావరణ అనుమతుల ప్రకారం రాజధాని ఆహార అవసరాలను తీర్చేందుకు పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అధిక విలువగల వ్యవసాయ భూమిని ఇందుకోసమే కేటాయించాలని నిబంధనలు చెబుతున్నాయి. అదే విధంగా కృష్ణా నదికి సమాంతరంగా 2–3 కిలోమీటర్ల మేర ఉన్న భూమిని కేవలం వ్యవసాయం, ‘బ్లూ–గ్రీన్’ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి. ఈ నిబంధనలను ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కేసింది. నదీ పరీవాహక ప్రాంతాన్ని యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. వ్యవసాయ భూముల జోలికి వెళ్లే హక్కు ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. నదులను విధ్వంసం చేస్తున్న చంద్రబాబు తనను తాను వాటర్‌మ్యాన్‌గా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం.
ప్రకృతి తరఫున గొంతెత్తుతాం..
ఇక పర్యావరణ విధ్వంసంతో కూడిన అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదిలేదని జల బిరాదరి జాతీయ కన్వీనర్, పర్యావరణ కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ తేల్చిచెప్పారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రకృతి గొంతెత్తలేదని, ప్రకృతి తరఫున తాము గొంతెత్తుతామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పర్యావరణవేత్త అనుమోలు గాంధీ కూడా పాల్గొన్నారు.
ముంచుకొస్తున్న వరద ముప్పు..
అమరావతిలో నీటి ప్రవాహ మార్గాలు, వరద ముప్పు, నేల స్వభావాన్ని గాలికొదిలేసి సాగిస్తున్న నిర్మాణాలు భవిష్యత్తులో పెను విషాదానికి దారితీస్తాయి. గతంలో వచ్చిన వరదల అనుభవాలను విస్మరించి, కృష్ణా నది సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే వరదలు ముంచెత్తడం ఖాయం. నిబంధనలు ఉల్లంఘిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చి నిర్మాణాలు నిలిచిపోతాయి. ఫలితంగా రూ.వేల కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. విశాఖలో డేటా సెంటర్ ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలకు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.
రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలు, వందల ఎకరాల భూమి కేటాయింపు నేపథ్యంలో రాష్ట్రానికి కలిగే వాస్తవ ప్రయోజనం ఎంత? కేవలం 500 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమి కేటాయింపుల్లో పారదర్శకత ఎక్కడ ఉంది? సున్నిత పర్యావరణ ప్రాంతమైన కంబాలకొండకు బోడిగుండు కొట్టేశారు. ప్రపంచం అంతా పునరుత్పాదక ఇంధనాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో చింతలపూడి–రేచర్లలో సారవంతమైన వేల ఎకరాల భూములను భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ)కు ఎలా కేటాయిస్తారు? యూసీజీ ఓ విఫల ప్రయోగం. ఈ ప్రాజెక్టు ఎక్కడా సత్ఫలితాలు ఇవ్వలేదు.


