వివాహ వేడుకలో తమిళనాడు సీఎం విజయ్, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ
నూతన దంపతులకు వైఎస్ జగన్ దంపతుల ఆశీర్వాదం
తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిష హాజరు
వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ, కేటీఆర్ దంపతులు
వ్యాపార, రాజకీయ ప్రముఖుల రాకతో లీలా ప్యాలెస్‌లో సందడి
సాక్షి, చెన్నై: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి, మాలిని దంపతుల కుమార్తె శ్రేయరెడ్డి, అంజన–గోవింద్ బిలాని దంపతుల కుమారుడు ఉజ్వల్‌ల వివాహం గురువారం చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో కనుల పండువగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దంపతులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ప్రముఖ సినీ నటి త్రిష, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దంపతులు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు హాజరై వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

వధూవరులు శ్రేయ–ఉజ్వల్‌లతో మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు..చిత్రంలో తమిళనాడు సీఎం విజయ్, సినీనటి త్రిష, ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ దంపతులు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు
నూతన దంపతులు సుఖ సంతోషాలతో, ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఈ వివాహానికి విచ్చేయడంతో లీలా ప్యాలెస్ సందడిగా మారింది. కాగా, వైఎస్ జగన్ చెన్నైకి విచ్చేశారని తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జాకీర్ హుసేన్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు లీలా ప్యాలెస్ వద్ద స్వాగతం పలికారు.
అభిమానులు దారి పొడవునా పువ్వుల వర్షం కురిపిస్తూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బంధువులు, మిత్రులు, పార్టీ వర్గాలను ఆప్యాయంగా పేరు పేరునా పలకరిస్తూ వేదిక వద్దకు వెళ్లారు. ఈ వివాహ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.


