కడప: పరిషత్ ఎన్నికల నిర్వహణలో సైతం ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. మొత్తంగా స్థానిక ఎన్నికల్ని అపహాస్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో అడుగడుగున యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, చరిత్రలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదన్నారు. ఎన్నికల్లో కనీసం ఓటరును ఓటు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేశారన్నారు.
పులివెందుల పార్టీ కార్యాలయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘ మున్సిపల్ ఎన్నికల తరహాలోనే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు.జరిగాయి. పోలీసులే ఎన్నికలు నిర్వహించి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు కూటమి ప్రభుత్వానికి ఎన్నికల అధికారులు వత్తాసు పలికారు. మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారు.
పోలింగ్ కేంద్రంలో మా పార్టీ ఏజెంట్లను అనుమతించలేదు. ఇతర ప్రాంతాల నుంచి జనాలను తరలించి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సైక్లింగ్ చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఎస్పీకి ఫోన్ చేసి తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని కోరిన పట్టించు కోలేదు. పులివెందులలో జరిగిన అక్రమాలపై ఎస్ఈసీకి పిర్యాదు చేశాం.
మా విన్నపం మేరకు ఆ ప్రాంతాల్లో రీపొలింగ్ చేయాలి. ఎస్ఈసీ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. సీసీ పూటేజీను నిశితంగా పరిశీలించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడ ఎన్నికల అదికారులు తుంగలో తొక్కారు. మేబు అడిగినట్టు సీసీ ఫూటేజ్ హార్డ్ డిస్క్ ఇస్తే వారి లీలలు బయట పడతాయి. మాకు ప్రజల బలం ఉందనే భయంతో కూటమి పార్టీలు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు’ అని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: చంద్రబాబు గెలిచి ఓడితే.. మేం ఓడి గెలిచాం: వైఎస్ జగన్


