ఎన్నారై వేషాలకు చెక్‌! | Divorce granted by foreign court on ground of irretrievable breakdown of marriage not legal says Supreme Court | Sakshi
Sakshi News home page

ఎన్నారై వేషాలకు చెక్‌!

Nov 6 2026 12:28 AM | Updated on Nov 6 2026 12:28 AM

Divorce granted by foreign court on ground of irretrievable breakdown of marriage not legal says Supreme Court

విదేశాల్లో కొలువనీ, లక్షల్లో జీతమనీ, అక్కడ కులాసా జీవితమనీ కబుర్లు చెప్పి పెళ్లాడి తీరా అక్కడికెళ్లాక నరకం చూపించేవారికి, అక్కడి కోర్టుల్లో సులభంగా విడాకులు తీసుకునేవారికి సర్వోన్నత న్యాయస్థానం ఝలక్‌ ఇచ్చింది. అలాంటి విడాకులు ఇక్కడ చెల్లుబాటుకావనీ, ఆ ప్రాతిపదికన చేసుకునే మారు వివాహం బహుభార్యత్వం కింద నేరమే అవుతుందనీ మంగళవారం జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ శ్రీచంద్రశేఖర్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి వైద్యుడొకరు అక్కడి న్యాయస్థానం మంజూరు చేసిన విడాకుల ఆధారంగా రెండో పెళ్లి చేసుకున్న ఉదంతంలో ఈ తీర్పు వెలువడింది. 

పెళ్లి చేసుకుని ఎన్నో కలలతో విదేశాలకెళ్లే యువతులు సమస్యలు ఎదుర్కొనటం అంతకుముందూ ఉండొచ్చుగానీ... 90వ దశకంలో సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి చెందాక ఈ మాదిరి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఎన్నోవిధాల వాకబుచేసి, కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుని చేసే పెళ్లిళ్లు సైతం ఏవేవో కారణాలతో పెటాకులవుతున్నాయి. ఊహించని ఈ పరిణామాలతో మధ్యతరగతి తల్లిదండ్రులుబెంగటిల్లి ఏం చేయాలో తోచక అవస్థలు పడుతున్నారు. మధ్యవర్తుల ద్వారానో, స్వయంగానో పరిష్కరిద్దామంటే దేశంకాని దేశంలో ఉండే అల్లుళ్లు ఫోన్‌కు కూడా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. 

వెళ్లటం దుర్లభమై, వెళ్లినా ఫలితం ఉంటుందన్న ఆశ కూడా లేక అలాంటివారు కుమిలిపోతున్నారు. ఈ బాపతు యువకుల్లో రకరకాలవారుంటారు. విమానం ఎక్కేవరకూ ఒకలా ఉండి, అటుతర్వాత అదనపు కట్నం ఆశించో, ఇతరే తరమైన ఆలోచనలతోనో ఆడపిల్లల్ని చిత్రహింసలపాలు చేస్తున్నారు. మరికొందరుపెళ్లి చేసుకుని, ముచ్చట్లన్నీ తీర్చుకుని మళ్లీ వచ్చి తీసుకెళ్తామంటూ కథలు చెప్పి మాయమవుతున్నారు. ఇలాంటి ఉదంతాల్లో వస్తున్న ఫిర్యాదుల సంఖ్య అంతకంతకు పెరగటంతో కేంద్ర ప్రభుత్వం 2018లోనే భారతీయ శిక్షాస్మృతిలో అవసరమైన నిబంధ నలు చేర్చాలని నిర్ణయించింది. 

రెండేళ్లక్రితం క్రిమినల్‌ చట్టాల స్థానంలో కొత్త చట్టాలొచ్చాయి. కానీ సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీపీసీ) మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. అందులోని సెక్షన్‌ 13 విదేశీ న్యాయస్థానాల ద్వారా పొందే విడాకులు ఇక్కడ చెల్లుబాటు కావని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పుల ఆధారంగా మరో పెళ్లి చేసుకుంటే భారతీయ చట్టాల దృష్టిలో అది చెల్లుబాటుకాదని ఆ నిబంధన చెబుతోంది. అలాంటివారిపై బహుభార్యత్వం కింద భారతీయ శిక్షాస్మృతిలోని 494 కింద కేసు నమోదు చేయొచ్చని ఆ నిబంధన అంటున్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్నే మరోసారి చెప్పింది. ఈ దేశంలో పెళ్లాడి, ఇక్కడ కొంతకాలం గడిపి వెళ్లేవారెవరైనా ఇక్కడి చట్టాల ఆధారంగా ఫ్యామిలీ కోర్టుల్లో మాత్రమే పిటిషన్లు దాఖలుచేసి విడాకులు పొందాలని వివరించింది. 

సత్తెనపల్లివాసి అతి తెలివికి పోయాడు. భార్య కాన్పు కోసం భారత్‌ తిరిగిరావటాన్ని ఆసరా చేసుకుని శాశ్వతంగా ఆమెను వదిలించుకునే ఎత్తుగడ పన్నాడు. దాంపత్యజీవితంలో పొరపొచ్చాలు వచ్చాయి గనుక విడాకులిప్పించాలంటూ నర్సరావుపేట కోర్టులో వేసిన పిటిషన్‌ తోసిపుచ్చడంతో హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడా తనకు అనుకూలంగా తీర్పు రాకపోవటంతో బ్రిటన్‌ పౌరసత్వం వచ్చేవరకూ ఆగి అక్కడికేంబ్రిడ్జి కౌంటీ కోర్టులో విడాకులు పొందాడు. చాలామంది ఎన్నారైలు చేసే పని ఇదే. కానీ హిందూ వివాహ చట్ట నిబంధనల ప్రకారం వివాహమాడినవారు వేరే దేశాల కోర్టుల్లో విడాకులు పొందినా చెల్లుబాటుకాదని గతంలోనూ కోర్టులు చెప్పాయి. విదేశీ యులకు వెసులుబాటిచ్చే ఐపీసీలోని సెక్షన్‌ 4 వర్తించబోదని కూడా స్పష్టంచేశాయి. 

ఇలాంటి కేసుల్లో అనుసరించదగిన నియమాలను 1991లోనే సుప్రీంకోర్టు నిర్ధారించింది. కానీ ఏదో వంకన దీర్ఘకాలం వ్యాజ్యం కొనసాగిస్తూ అత్తింటివారిని ఆర్థికంగా దెబ్బతీస్తే, విసుగుచెంది రాజీ మార్గానికొస్తారని, సులభంగా వదిలించుకోవచ్చని చాలామంది భావిస్తున్నారు. గత దశాబ్దకాలంలో ఈ మాదిరి ఎన్నారై విడాకుల కేసులు 35 శాతం మేర పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో న్యాయస్థానాల పరిధి ప్రశ్నార్థకమైన కేసులే 60 శాతం పైగా ఉన్నాయి. ఇలాంటి వంచకుల ఆటకట్టించే క్రమంలో తాజా సుప్రీంకోర్టు తీర్పు ఒక ముందడుగు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement