ఆఫ్రికాలో పాగా వేయటానికి పోటీ | No one is paying attention to the role that the African continent plays in world politics | Sakshi
Sakshi News home page

ఆఫ్రికాలో పాగా వేయటానికి పోటీ

Nov 6 2026 12:20 AM | Updated on Nov 6 2026 12:19 AM

No one is paying attention to the role that the African continent plays in world politics

ప్రపంచ రాజకీయాలలో ఆఫ్రికా ఖండం నిర్వహిస్తున్న పాత్రలో వస్తున్న మార్పులను ఎవరూ పట్టించుకోవటం లేదు. అమెరికా, యూరప్, రష్యా, చైనా, టర్కీ, ఇండియా తమ ఆఫ్రికా విధానాలలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. అక్టోబర్‌ నెలాఖరులో మాస్కోలో రష్యా–ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం జరిగింది. 21 దేశాధ్యక్షులతో కలిపి మొత్తం 48 ఆఫ్రికన్‌ దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. అంతర్జాతీయ సమాజంలో రష్యాను ఏకాకిని చేయాలనే పాశ్చాత్య దేశాల వ్యూహానికి పుతిన్‌ ఈ ఆఫ్రికన్‌ శిఖరాగ్ర సమావేశం ద్వారా చెక్‌ పెట్టినట్లయింది. రష్యన్‌ ఔషధాలు, వ్యాక్సిన్లను ఆఫ్రికాలో తయారు చేయటానికి రష్యా సమ్మతించింది.

ఆఫ్రికన్‌ దేశాల ప్రభుత్వాలకు భద్రత కల్పించటంలో రష్యా కీలక పాత్ర పోషిస్తున్నది. 2023లో వాగ్నర్‌ గ్రూప్‌ను రద్దు చేసి దాని స్థానంలో ఆఫ్రికన్‌ కోర్‌ ద్వారా ఆఫ్రికా దేశాలకు భద్రత, సైనిక సహ కారాన్ని అందిస్తున్నది. మాలి, సూడాన్, లిబియా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లలో ప్రభుత్వాలకు రష్యా సేనలు రక్షణ కల్పిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఈ దేశాల నుండి రష్యా బంగారాన్ని పొందుతున్నది. ఆఫ్రికా నుండి ఫ్రెంచ్‌ వలస పాలకుల నిష్క్రమణను రష్యా తనకు అనుకూలంగా మలచుకొంటున్నది.

అమెరికా–చైనా విధానాలు
ట్రంప్‌ రెండవసారి అధికారంలోనికి వచ్చాక ఆఫ్రికా విధానంలో సమూలంగా మార్పులు వచ్చాయి. సబ్‌సహారన్‌ ఆఫ్రికా దేశాలకు అమెరికా ఇచ్చే 2 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వార్షిక సహా యాన్ని పూర్తిగా నిలిపివేశారు. ‘అమెరికన్‌ నేషనల్‌ సెక్యూరిటీ స్ట్రాటజీ–2025’ ఆఫ్రికాను క్రిటికల్‌ మినరల్స్‌ కొరకు, చైనాను ఎదుర్కోవటానికి ఒక ఉదాహరణలాగ వాడుకోవాలని సూచిస్తుంది. 2026 ఫిబ్రవరిలో 55 ఆఫ్రికన్‌ దేశాల క్రిటికల్‌ మినరల్స్‌ సమా వేశాన్ని అమెరికా నిర్వహించింది. మందులు, ఆరోగ్య రంగం కోసం జాంబియాకు ఇచ్చే 1.5 బిలియన్‌ డాలర్ల సహాయాన్ని అమెరికా క్రిటికల్‌ మినరల్స్‌కు ముడిపెట్టింది. దక్షిణాఫ్రికాతో అమెరికాసంబంధాలు పూర్తిగా గాడి తప్పాయి. జోహెనస్‌బర్గ్‌లో జరిగిన (2025) జీ–20 సమావేశాన్ని యూఎస్‌ఏ బహిష్కరించింది. 

ఆఫ్రికా పరంగా యూరప్‌కు ఒక ఏకీకృత, సంఘటిత విధానం లేదు. పూర్వ వలస పాలకులైన ఫ్రాన్స్‌ దాదాపుగా ఆఫ్రికా నుండి నిష్క్రమించింది. మాలి, నైజర్, బుర్కినాఫాసోల నుండి ఫ్రాన్స్‌గెంటివేతకు గురయ్యింది. చాద్‌ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో సైనిక ఒప్పందాన్ని రద్దు చేయటంతో ఫ్రెంచ్‌ సైనికులు నిష్క్రమించారు. ఆఫ్రికా నుండి ఫ్రాన్స్‌ నిష్క్రమిస్తున్న దశలో ఆ ఖాళీని భర్తీ చేయటానికా అన్నట్లు ఆఫ్రికాతో సంబంధాలలో నూతన అధ్యాయానికి ఇటలీ ప్రణాళిక సిద్ధం చేసింది. 2024లో ప్రకటించిన ‘మాటీ’ ప్రణాళికలో భాగంగా ఇటలీ ఇప్పటికే పద్దెనిమిది దేశాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నది. ఇందులో భాగంగా రాగి, కోబాల్ట్‌ విస్తారంగా లభించే ‘లొబిటో కారిడార్‌’ ప్రాంతంతో సహా వివిధ దేశాల క్రిటికల్‌ మిన రల్స్‌ నిల్వలపై కన్నేసింది.

చైనా 36 ఆఫ్రికన్‌ దేశాలకు వివిధ రకాల సైనిక సామగ్రి, ఆయు ధాలను సరఫరా చేస్తున్నది. జిబూతీలో చైనా శాశ్వత సైనిక స్థావ రాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఆఫ్రికన్‌ దేశాల సైన్యాలకు శిక్షణా సౌకర్యాలను కల్పిస్తున్నది. ఆఫ్రికాతో చైనా వాణిజ్యం 200 బిలియన్‌ డాలర్లకు చేరింది. బుర్కినాఫాసో, మాలి, నైజర్‌ వంటి ఆఫ్రికన్‌ దేశాలకు టర్కీ ప్రధానంగా డ్రోన్లను సరఫరా చేస్తు న్నది. గతేడాది టర్కీ సైనిక ఎగుమతుల విలువ ఏడు బిలియన్‌ డాలర్లు.

భారత్‌ సంబంధాలు
ప్రపంచ ప్రధాన రాజకీయ శక్తులతో పోల్చితే ఆఫ్రికాతో భారత్‌ భాగస్వామ్యం స్వభావం వేరుగా ఉన్నది. భారత్‌–ఆఫ్రికా సంబంధాలలో సైనిక, భద్రత అంశాలకు అంతగా ప్రాధాన్యత లేదు. 2018 తరువాత ఆఫ్రికాలో భారత్‌ పదిహేడు కొత్త దౌత్య కార్యాలయాలను తెరిచింది. ఆఫ్రికాతో వాణిజ్యం వంద బిలియన్‌ డాలర్లకు చేరు కున్నది. ముప్ఫై మూడు ఆఫ్రికన్‌ దేశాలకు పది బిలియన్‌ డాలర్ల లైన్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను అందజేస్తున్నది. ఈ దేశాలకు సుమారు 98 శాతం దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేసింది. 

సెషెల్స్, మారిషస్, నైజీరియా, మొజాంబిక్‌లతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, సైనిక ఎగుమతులకు ఒప్పందాలు చేసుకున్నది. ఆఫ్రికన్‌ దేశాలకు భారత్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఎగుమతి చేస్తున్నది. కెన్యాతో భారత్‌ డిజిలాకర్‌ ఏర్పాటుకు ఒప్పందం ఖరాయింది. సహ బ్రిక్స్‌ దేశాలైన దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియాలతో సన్నిహితసంబంధాలను అభివృద్ధి పరుస్తున్నది. 2008లోనూ ఆ తరువాత 2015లోనూ మనదేశం ‘ఇండియా–ఆఫ్రికా ఫోరమ్‌’ సదస్సులను నిర్వహించింది. ఎబోలా వైరస్‌ వ్యాప్తి వలన 2026 మే న్యూఢిల్లీలో జరగవలసిన నాలుగో ఇండియా–ఆఫ్రికా ఫోరమ్‌ శిఖరాగ్ర సమా వేశం వాయిదా పడింది.

మారిన వ్యవహార శైలి
స్థూలంగా పరిశీలిస్తే ఆఫ్రికా పరంగా ప్రధాన ప్రపంచ రాజ కీయ శక్తుల వ్యవహార శైలిలో విస్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వలస పాలన అంతమైనా... రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యూరప్, అమెరికాలు ఆఫ్రికాను వలస కోణం నుండే చూశాయి. మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు వంటి అంశాలపై ఆఫ్రికన్‌ దేశాలకు హితబోధనే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాయి. ఆఫ్రికన్‌ దేశాలకు షరతులతో కూడిన ఆర్థిక సహాయం, గ్రాంట్లు, రుణాలను మంజూరు చేశాయి. తమ స్వార్థ ప్రయోజనాలకు అను గుణంగా వివిధ ఆఫ్రికన్‌ దేశాలలో ప్రభుత్వాలను సమర్థించటం లేదా కూలదోయటం చేశాయి. ఇరవయ్యొకటవ శతాబ్దంలో పరిస్థితులు క్రమంగా మారిపోయాయి. ఆఫ్రికన్‌ యూని యన్‌ క్రియాశీలకమవటంతో ఆఫ్రికా ప్రయోజనాలను పరిరక్షించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. యాభై ఆఫ్రికన్‌ దేశాలు రాటిఫై చేసిన ‘ఆఫ్రికన్‌ కాంటినెంటల్‌ ఫ్రీ ట్రేడ్‌ ఏరియా’ స్థానిక వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షిస్తున్నది.

ఉక్రెయిన్‌ యుద్ధం, పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా, ఆఫ్రికన్‌ దేశాలతో దృఢమైన సంబంధాలను కోరుకుంటు న్నది. రష్యా, చైనా, భారత్, టర్కీల రూపంలో ఆఫ్రికన్‌ దేశాలకు ప్రత్యామ్నాయ మిత్రులు లభించారు. చైనాతో వైరుధ్యాల వలన అమెరికా, యూరప్‌లు ఆఫ్రికన్‌ దేశాలలోని ఖనిజ వనరులపై ఆధారపడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తృతీయ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్న భారత్‌–చైనాలు ఆఫ్రికాతో దౌత్య, వాణిజ్య, సైనిక సంబంధాలకు పెద్దపీట వేస్తున్నాయి. వలస యజమానులు (కొలోనియల్‌ మాస్టర్స్‌)గా ఆఫ్రికాతో వ్యవహరించటం ఇక సాధ్యం కాదని యూరప్‌కు తత్వం బోధపడింది.

ప్రస్తుతం ఆవిర్భవిస్తున్న బహుళ ధ్రువ ప్రపంచంలో ఆఫ్రికా ఖండాన్ని విస్మరించటం ఆత్మహత్యా సదృశమని ప్రపంచ రాజకీయ శక్తులు గుర్తించాయి. ఆఫ్రికాతో సంబంధాలను సాధ్యమైనంతవేగంగా వ్యూహాత్మక స్థాయికి తీసుకువెళ్లవలసిన అవసరం భారత్‌కు ఎంతైనా ఉన్నది. ఆఫ్రికన్‌ దేశాలు భారత్‌ను స్థిరమైన, నమ్మదగిన భాగస్వామిగా పరిగణిస్తున్నప్పటికీ, వాస్తవంగా చూసి నప్పుడు భారత్‌ ఇప్పటికీ చైనాతో పోల్చితే వెనుకబడే ఉన్నది.

స్థూలంగా ఆఫ్రికా పరంగా ప్రధాన ప్రపంచ రాజకీయ శక్తుల వ్యవహార శైలిలో విస్పష్టమైన మార్పు కనిపిస్తోంది.


-వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు
- గురజాల శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement