టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా వాణిజ్య నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన ఇరాన్.. ఇప్పుడు భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది. ఈ నాలుగు దేశాల నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించవచ్చని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ ఉపాధ్యక్షుడు అమీర్ హయత్ మొగద్దమ్ వెల్లడించారు.
భారత్‌కు ఈ మినహాయింపు ఇవ్వడం వెనుక ప్రధానంగా ఔషధాల దిగుమతులకు అవకాశం కల్పించడమే ఇరాన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక చైనాకు రాజకీయ మద్దతు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే భారత నౌకలకు ప్రయాణ అనుమతి ఇచ్చినప్పటికీ రవాణా ఛార్జీల నుంచి మినహాయింపు ఉండకపోవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
భారత్‌కు ఎందుకు కీలకం?
భారత్ ఇంధన అవసరాల కోసం మధ్యప్రాచ్య దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ ఇంధన సరఫరాల్లో సాధారణ పరిస్థితుల్లో దాదాపు 20 శాతం రవాణా జరుగుతుంది. ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోతే భారత్‌తో పాటు ప్రపంచ వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇక చైనా కూడా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే ప్రధాన దేశాల్లో ఒకటి. ఇరాక్, ఖతార్ కూడా ఇరాన్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన దేశాలు. అందుకే ఈ నాలుగు దేశాల నౌకలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 12 కిలోమీటర్ల ఛేజింగ్.. మహిళ కిడ్నాప్ డ్రామా గుట్టురట్టు!


