హార్మూజ్ సలసంధి విషయంలో భారత్‌కు భారీ ఊరట దక్కింది. ఇతర దేశాల నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన నౌకలు హార్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ వ్యూహాత్మక జలమార్గంపై తనకున్న నియంత్రణను ఆర్థిక, దౌత్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు ఈ నిర్ణయం సూచిస్తోంది.
ఇరాన్ విద్యార్థి మీడియా సంస్థను ఉటంకిస్తూ టర్కీ ప్రభుత్వ వార్తా సంస్థ ‘అనడోలు’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్‌కు, ఈ 4 దేశాలకు మధ్య ఉన్న పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఈ మినహాయింపులు కల్పించినట్లు తెలిపింది. అయితే, ఈ నిర్ణయం హార్ముజ్ జలసంధిపై ఆంక్షలను పూర్తిగా సడలించినట్లు కాదు. కీలక భాగస్వామ్య దేశాల నౌకలకు మాత్రమే మార్గం తెరిచి ఉంచుతూ.. ప్రత్యర్థులుగా భావించే దేశాలపై ఒత్తిడిని కొనసాగించేలా ఇరాన్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ 4 దేశాల నౌకలకు హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తామని ఇరాన్ పార్లమెంటరీ అధికారి అహ్మద్ హయత్ మొగద్దమ్ తెలిపారు. ఇరాన్‌తో పాటు ఆయా దేశాలకు ఉన్న పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
భారత్‌కు ఎందుకు కీలకం?
ఇంధన సరఫరాల కోసం గల్ఫ్ దేశాలపై భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ ప్రాంతంతో భారత్‌కు విస్తృత వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇరాన్ నిర్ణయం భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందంలో ఔషధాల సరఫరా అంశం కూడా ఉంది. ప్రాంతీయ అంతరాయాల మధ్య భారత్ నుంచి మందులు అందుబాటులో ఉండేలా భారత నౌకల ప్రయాణాన్ని సులభతరం చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ మినహాయింపు అంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా లేదా ఉచితంగా ప్రయాణించవచ్చని అర్థం కాదు. భారత నౌకలకు ఇప్పటికీ రవాణా రుసుములు విధించే అవకాశం ఉందని వార్తలు సూచిస్తున్నాయి. అంటే జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఇవ్వడమే ఇరాన్ రాయితీగా కనిపిస్తోంది. ప్రయాణానికి సంబంధించిన ఆర్థిక భారాన్ని పూర్తిగా తొలగించినట్లు కాదు.
చైనాకు కూడా కీలక ప్రయోజనం
ఇరాన్‌తో చైనాకు ఉన్న వ్యూహాత్మక సంబంధాలు ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ చమురును కొనుగోలు చేసే ప్రధాన దేశాల్లో చైనా ఒకటి. ఇరాన్ పాలకులకు ఆర్థిక, దౌత్యపరమైన మద్దతు అందించే ముఖ్యమైన దేశంగా కూడా ఉంది. చైనా నౌకలకు ఈ మార్గంలో ప్రయాణించే అవకాశం కల్పించడం ద్వారా ఆ కీలక ఆర్థిక సంబంధాలను కాపాడుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ చైనా నుంచి దౌత్యపరమైన మద్దతును కొనసాగించుకోవాలని చూస్తోంది.
ఖతార్, ఇరాక్‌లకు ఎందుకు మినహాయింపు?
ఈ ఏర్పాటులో ఖతార్, ఇరాక్‌లకూ వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలో ద్రవరూప సహజ వాయువు ఎగుమతి చేసే అగ్రదేశాల్లో ఖతార్ ఒకటి. గల్ఫ్ ప్రాంతంలోని నౌకా రవాణా మార్గాలు నిరంతరం అందుబాటులో ఉండటం ఆ దేశానికి ఎంతో ముఖ్యం. దోహాతో కుదిరిన అవగాహనలోని కచ్చితమైన నిబంధనలను టెహ్రాన్ బహిరంగంగా వెల్లడించలేదు. అయితే ఖతార్ నౌకలకు ప్రయాణ అనుమతి ఇవ్వడం ద్వారా ప్రాంతీయంగా కీలకమైన సంబంధాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇక ఇరాక్ వాణిజ్యం, ఇంధన సంబంధిత సరుకుల రవాణా కోసం గల్ఫ్ సముద్ర మార్గాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. బాగ్దాద్‌కు, టెహ్రాన్‌కు మధ్య చాలాకాలంగా ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు కూడా ఈ మినహాయింపునకు కారణంగా కనిపిస్తున్నాయి. అయితే ఇరాక్ నౌకలకు రవాణా రుసుములు విధిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు.
చర్చల్లో ఆయుధంగా హార్మూజ్ జలసంధి
ఈ ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే మినహాయింపులు ఇవ్వడం వెనుక ఇరాన్ విస్తృత వ్యూహం కనిపిస్తోంది. అన్ని దేశాల నౌకలపై ఒకే విధమైన ఆంక్షలు విధించకుండా.. హార్మూజ్ జలసంధిలో ప్రవేశానికి అనుమతిని చర్చల్లో ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని టెహ్రాన్ భావిస్తోంది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఈ పరిణామం ఎంతో కీలకం. అంతర్జాతీయ చమురు, సహజ వాయువు రవాణాకు హార్ముజ్ జలసంధి అత్యంత ముఖ్యమైన మార్గం. ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడితే ఇంధన ధరలు, సరుకు రవాణా ఖర్చులు, ప్రపంచ సరఫరా వ్యవస్థలపై ప్రభావం పడుతుంది.


