మధ్యంతర ఎన్నికల వేళ ఖెష్మ్‌ దీవిపై అమెరికా దాడులు | US strikes Iranian island ahead of midterm elections | Sakshi
Sakshi News home page

మధ్యంతర ఎన్నికల వేళ ఖెష్మ్‌ దీవిపై అమెరికా దాడులు

Nov 4 2026 4:39 AM | Updated on Nov 4 2026 4:39 AM

US strikes Iranian island ahead of midterm elections

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హార్మూజ్‌ జలసంధిలో ఉన్న ఇరాన్‌కు చెందిన కీలక ఖెష్మ్‌ దీవిపై అమెరికా దాడులకు పాల్పడింది. అమెరికా యుద్ధ విమానంపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు దాడికి స్పందనగా ఆత్మరక్షణ కోసం పరిమితమైన ఈ దాడులు చేపట్టామని తెలిపింది. ఖెష్మ్‌ దీవిలో భారీగా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్‌ అధికార వార్తా సంస్థ ఇర్నా ప్రకటించింది. ఘటనపై రివల్యూషనరీ గార్డు విభాగం స్పందించలేదు. అయితే, ఖెష్మ్‌ దీవికి దక్షిణాన సంచరిస్తున్న అమెరికాకు చెందిన అధునాతన ఎంక్యూఎం–170 రకం డ్రోన్లు రెండింటిని, ఎంక్యూ–9 రకం డ్రోన్‌ ఒకదాన్ని హార్మూజ్‌ జలసంధికి తూర్పు ప్రాంతంలో కాల్చివేసినట్లు ప్రకటించింది.

అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి పూర్తి స్థాయిలో యుద్ధం రాకుండా నివారించేందుకు మధ్యవర్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఇరాన్‌పై దాడుల విషయంలో తొందరపడటం లేదు. ఇప్పటికే ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశాం. ఇతర మార్గాల్లో దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాడులకు దిగాలన్న తొందరేం లేదు’అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌ అణు కార్యక్రమానికి కీలకంగా ఉన్న పిక్‌యాక్స్‌ పర్వతంపై దాడులు చేపట్టాల్సిన అవసరం మాత్రం ఉందన్న ఆయన..ఇది గంటలో పూర్తయ్యే పని అంటూ చెప్పుకొచ్చారు.

మధ్యంతర ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులకు దిగవచ్చంటూ వస్తున్న వార్తలపై ట్రంప్‌..ఆ అవకాశమే లేదంటూ కొట్టిపారేయడం గమనార్హం. తాజాగా, ఖెష్‌్మపై అమెరికా జరిపిన దాడులపై ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ ఘలిబాఫ్‌ స్పందిస్తూ.. ‘మేం యుద్ధానికి రెడీ. యుద్ధాన్ని అపే అవకాశం ఇప్పటికీ అమెరికాకు ఉంది’అని పేర్కొన్నారు. కాగా, ఇరాన్‌–అమెరికాల మధ్య కాల్పుల విరమణ చర్చల మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్‌ మంగళవారం.. కాల్పుల విరమణకు సంబంధించి ఇరుపక్షాలు అనేక ప్రతిపాదనలను ముందుకు తెచ్చాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement