ట్రంప్ ఖాతాలో 127 విజయాలు.. భారత్‌కూ లబ్ధి అంటూ.. | White House list of 127 promises kept by Trump claims | Sakshi
Sakshi News home page

ట్రంప్ ఖాతాలో 127 విజయాలు.. భారత్‌కూ లబ్ధి అంటూ..

Nov 3 2026 12:34 PM | Updated on Nov 3 2026 1:09 PM

White House list of 127 promises kept by Trump claims

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో సాధించిన విజయాలంటూ వైట్‌హౌస్ 127 అంశాలతో ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. అమెరికా మధ్యంతర ఎన్నికలకు కొన్ని గంటల ముందు నవంబర్ 2న ఈ నివేదికను ప్రకటించింది. వాణిజ్యం, విదేశాంగ విధానం, వలసలు, ఆర్థిక వ్యవస్థ వంటి కీలక రంగాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు అందులో పేర్కొంది. ముఖ్యంగా భారత్‌తో వాణిజ్య ఒప్పందం, భారత్‌-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ పాత్రను ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.

భారత్, చైనా, జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన భాగస్వామ్య దేశాలతో కొత్త, మెరుగైన వాణిజ్య ఒప్పందాలను సాధించినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ దేశాలన్నీ కలిపి ప్రపంచ జీడీపీలో సగానికి పైగా వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది. అయితే భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు మధ్యంతర ఒప్పందానికి సంబంధించిన ఒక రూపురేఖను ప్రకటించాయి. దాని అమలుతో పాటు సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా పనిచేయాలని నిర్ణయించాయి.

అంతర్జాతీయంగా ఎనిమిది ఘర్షణలను ముగించిన ఘనత ట్రంప్‌కే దక్కుతుందని వైట్‌హౌస్ తన జాబితాలో పేర్కొంది. ఇందులో 2025 మే నెలలో భారత్‌-పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ కూడా ఉందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదరడంలో ట్రంప్ పాత్ర ఉందన్న వాదనను మరోసారి తెరపైకి తెచ్చింది. అయితే భారత్‌ మాత్రం ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలను పదేపదే ఖండిస్తోంది. భారత్‌-పాకిస్థాన్ మధ్య సైనిక చర్యలను నిలిపివేసేందుకు జరిగిన అవగాహనలో మూడో దేశం ప్రమేయం లేదని స్పష్టం చేస్తోంది. పాకిస్థాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) తన భారత ప్రతినిధిని సంప్రదించిన తర్వాతే కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకున్నట్లు న్యూఢిల్లీ వెల్లడించింది. ఈ విషయంలో భారత్ తన వైఖరిని స్పష్టంగా కొనసాగిస్తోంది.

అమెరికా-మెక్సికో సరిహద్దులో సైనిక బలగాల మోహరింపు, సరిహద్దు గోడ నిర్మాణం పునఃప్రారంభం, 'రీమైన్ ఇన్ మెక్సికో' విధానం తిరిగి అమలు వంటి చర్యలను ట్రంప్ విజయాలుగా వైట్‌హౌస్ పేర్కొంది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో నమోదైన వార్షిక సగటుతో పోలిస్తే నైరుతి సరిహద్దులో అక్రమ వలసదారుల పట్టివేతలు 95 శాతం తగ్గాయని వెల్లడించింది. అలాగే 30 లక్షల మందికి పైగా పత్రాలు లేని వలసదారులు అమెరికాను విడిచివెళ్లినట్లు తెలిపింది.

ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వర్కింగ్ ఫ్యామిలీస్ ట్యాక్స్ కట్స్ కింద పన్ను మినహాయింపులు, దేశీయ చమురు, సహజ వాయువు ఉత్పత్తి పెంపు, వాణిజ్య విధానాల ద్వారా పెట్టుబడుల హామీలను వైట్‌హౌస్ ప్రస్తావించింది. కృత్రిమ మేధస్సు కార్యాచరణ ప్రణాళిక, స్టేబుల్‌కాయిన్లకు సంబంధించిన జీనియస్ చట్టం, నాసా ఆర్టెమిస్-2 మిషన్‌ను కూడా విజయాల జాబితాలో చేర్చింది. నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలతో పాటు సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఫలితాలు రాబోయే రెండేళ్ల పాటు కాంగ్రెస్‌పై ఎవరి ఆధిపత్యం ఉంటుందో నిర్ణయించనున్నాయి. ట్రంప్ పాలనకు ఈ ఎన్నికలు కీలక పరీక్షగా మారాయి. ఈ నేపథ్యంలో తన పాలనలో సాధించిన విజయాలను ప్రజల ముందుంచేందుకు వైట్‌హౌస్ 127 అంశాల జాబితాను విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement