టొరంటో: కెనడాలోని టొరంటోలో మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్‌కు చెందిన 32 ఏళ్ల యవకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైడ్ షేరింగ్ వాహనంలో ప్రయాణిస్తున్న మహిళను వేధించడంతో పాటు, ఆమె వాహనం దిగకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని బ్రాంప్టన్‌కు చెందిన సాహిబ్ బరార్‌గా పోలీసులు గుర్తించారు. అతడిపై లైంగిక వేధింపులకు సంబంధించి రెండు, నిర్బంధానికి సంబంధించి ఒక అభియోగం నమోదు చేశారు.
రాత్రి సమయంలో ఘటన
టొరంటో పోలీస్ సర్వీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31, 2026న రాత్రి సుమారు 9.50 గంటలకు యోంగ్ స్ట్రీట్, వెల్లెస్లీ స్ట్రీట్ ఈస్ట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు రైడ్ షేరింగ్ వాహనంలో ముందు సీటులో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో డ్రైవర్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళ తన గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత వాహనం దిగేందుకు ప్రయత్నించింది. అయితే డ్రైవర్ ఆమెను అడ్డుకుని మరోసారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎట్టకేలకు బాధితురాలు వాహనం నుంచి బయటపడింది. అయితే తన పర్సును వాహనంలోనే మర్చిపోయింది.
మహిళ వాహనం నుంచి బయటకు వచ్చిన తర్వాత డ్రైవర్ కూడా బయటకు వచ్చి మరోసారి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సాహిబ్ బరార్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై లైంగిక వేధింపులకు సంబంధించి రెండు అభియోగాలు, బలవంతంగా నిర్బంధించినందుకు ఒక అభియోగం నమోదు చేశారు. అతడిని టొరంటో రీజినల్ బెయిల్ సెంటర్‌లో హాజరుపరచాల్సి ఉంది.


