హైదరాబాద్‌కు తొలి ‘డ్రా’ | Hyderabad team has recorded its first draw in the Ranji Trophy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు తొలి ‘డ్రా’

Oct 30 2026 4:14 AM | Updated on Oct 30 2026 4:14 AM

 Hyderabad team has recorded its first draw in the Ranji Trophy

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన హైదరాబాద్‌... జింఖానా మైదానంలో పంజాబ్‌తో జరిగిన పోరును ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 57/0తో గురువారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పంజాబ్‌ జట్టు 78 ఓవర్లలో 240/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (68; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ (55 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), విహాన్‌ మల్హోత్రా (53; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలు సాధించారు. 

హైదరాబాద్‌ బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్, రక్షణ్‌ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్‌లు ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన పంజాబ్‌ వికెట్‌ కీపర్‌ సలీల్‌ అరోరాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అంతకుముందు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులు చేయగా... హైదరాబాద్‌ 380 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకున్న పంజాబ్‌ జట్టుకు 3 పాయింట్లు, హైదరాబాద్‌కు ఒక పాయింట్‌ దక్కాయి. 

ఆంధ్ర ఓటమి... 
సాక్షి, విజయవాడ: గ్రూప్‌ ‘బి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌ చేతిలో పరాజయంపాలైంది. సొంతగడ్డపై ఆంధ్రకు ఇది వరుసగా రెండో ఓటమి. మూలపాడు మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా ఒక రోజు ఆట తుడిచిపెట్టుకుపోగా... ఆంధ్ర జట్టు గురువారం ఆఖరి రోజు 184/3 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను అనూహ్యంగా డిక్లేర్‌ చేసి ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. కెప్టెన్‌ రికీ భుయ్‌ (72 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), కరణ్‌ షిండే (53 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలు సాధించారు. ఆంధ్ర విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని ఛత్తీస్‌గఢ్‌ విజయవంతంగా ఛేదించింది. ఆ జట్టు 35.1 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement