ఢిల్లీ 262/6 | Delhi sets record for the highest score by a team in womens domestic T20 cricket | Sakshi
Sakshi News home page

ఢిల్లీ 262/6

Oct 30 2026 4:11 AM | Updated on Oct 30 2026 4:11 AM

Delhi sets record for the highest score by a team in womens domestic T20 cricket

మహిళల దేశవాళీ టి20ల్లో అత్యధిక స్కోరు 

తనీషా సింగ్‌ సెంచరీ 

108 పరుగులతో హైదరాబాద్‌ ఓటమి 

పుణే: మహిళల దేశవాళీ టి20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఢిల్లీ రికార్డు సృష్టించింది. జాతీయ సీనియర్‌ మహిళల టి20 టోర్నమెంట్‌లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఈ ఘనత సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. మహిళల దేశవాళీల్లో ఇదే అత్యధిక స్కోరు. దీంతో 2019–20లో అరుణాచల్‌ ప్రదేశ్‌పై గోవా చేసిన 257/2 స్కోరు రెండో స్థానానికి చేరింది. ఓవరాల్‌గా మహిళల క్రికెట్‌లో ఇది 11వ అత్యధిక స్కోరు. మిగిలిన పది అంతర్జాతీయ మ్యాచ్‌లు కాగా.. దేశవాళీల్లో ఇదే అత్యధికం. 

ఢిల్లీ ఓపెనర్‌ తనీషా సింగ్‌ (47 బంతుల్లో 119; 25 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో తనీషా 38 బంతుల్లో శతకం పూర్తి చేసుకుంది. మహిళల టి20ల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. కిరణ్‌ నవ్‌గిరే (34 బంతుల్లో), సోఫీ డివైన్‌ (36 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా ప్లేయర్‌ ప్రియా పూనియా (28 బంతుల్లో 59; 9 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి తనీషా రెండో వికెట్‌కు 66 బంతుల్లోనే 160 పరుగులు జోడించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేయగలిగింది. 

శ్వేత సెహ్రావత్‌ (8 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించింది. హైదరాబాద్‌ బౌలర్లలో వంకా పూజ 4 వికెట్లు పడగొట్టింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్‌ గొంగడి త్రిషా (52 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ జట్టు 108 పరుగుల తేడాతో గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement