మహిళల దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పుణేలోని గహుంజే ఎమ్‌సిఎ గ్రౌండ్-2 వేదికగా హైదరాబాద్‌తో జరిగిన 'సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ' మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 262 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
దీంతో మహిళల దేశవాళీ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఢిల్లీ రికార్డులకెక్కింది. ఇంతకముందు ఈ రికార్డు గోవా పేరిట ఉండేది. 2019-20 సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా 2 వికెట్ల నష్టానికి 257 పరుగులు సాధించింది. తాజా మ్యాచ్‌తో గోవా ఆల్‌టైమ్ రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా ప్రపంచ మహిళల టీ20 క్రికెట్ (ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతో కలిపి) మొత్తంలో ఇది 11వ అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
తనీషా విధ్వంసం
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ వంశిక లీలా (9) త్వరగానే ఔటైంది. అయితే ఆ తర్వాత ఓపెనర్ తనీషా సింగ్, ప్రియా పూనియా కలిసి మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించారు. ప్రత్యర్థి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడిన తనీషా.. కేవలం 38 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసుకుంది.
కాగా మహిళల టీ20 క్రికెట్‌లో ఇది జాయింట్ 3వ అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. భారత ప్లేయర్ కిరణ్ నవ్‌గిరే (34 బంతుల్లో), న్యూజిలాండ్ స్టార్ సోఫీ డివైన్ (36 బంతుల్లో) మాత్రమే తనీషా కంటే వేగంగా సెంచరీ సాధించారు.
ఓవరాల్‌గా 47 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్సర్‌తో 119 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్రియా పూనియా 211 స్ట్రైక్ రేట్‌తో కేవలం 28 బంతుల్లో 59 పరుగులు చేసి కీలక నాక్ ఆడింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 66 బంతుల్లోనే 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
హైదరాబాద్ చిత్తు
263 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ గొంగడి త్రిష (52 బంతుల్లో 80 పరుగులు) పోరాడినప్పటికీ.. మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఢిల్లీ 108 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
కాగా ఇటీవలే జరిగిన డబ్ల్యూపీఎల్ 2027 మినీ వేలంలో తనీషా సింగ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. అయితే ప్రస్తుతం ఆమె అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో రీప్లెస్‌మెంట్‌గా ఏదో ఒక ఫ్రాంచైజీ సొంతం చేసుకునే అవకాశముంది.


