బుమ్రా- వకార్ యూనిస్ (PC: BCCI/X)
పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్ వ్యాఖ్యలు
ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా. ఈ రైటార్మ్ బౌలర్ బంతితో రంగంలోకి దిగాడంటే ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టాల్సిందే. వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో ఈ గుజరాతీ ఆటగాడు దిట్ట.
బూమ్ బూమ్ బుమ్రా అంటే వణుకే...
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికీ బుమ్రా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. టీమిండియా తరఫున ఇప్పటిదాకా 91 వన్డేలు, 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. వన్డేల్లో 151, టీ20లలో 126 వికెట్లు కూల్చాడు. ఇక టెస్టుల్లో 52 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. 234 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో బుమ్రా గురించి పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో బుమ్రా తోపు బౌలర్ అంటూనే.. టెస్టుల్లో మాత్రం ఇప్పటికీ అతడు నిరూపించుకోవాల్సింది చాలా ఉందన్నాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బుమ్రాకు ఎవరూ సాటిలేరు
శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నవతరం క్రికెటర్లలో బుమ్రాకు పోటీ వచ్చే బౌలర్ ఎవరూ లేరన్నది వాస్తవం. అతడికి ఉన్న నైపుణ్యాలు మరెవరికీ లేవని చెప్పవచ్చు. అయితే, టెస్టుల్లో మాత్రం బుమ్రా ఇంకా చాలా మటుకు నిరూపించుకోవాల్సి ఉంది.
టెస్టులలో ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది
అతడు ఎక్కువగా టెస్టులు ఆడలేదు. అయితే, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ వంటి ఆసీస్ పేసర్లు, మరికొందరు ఇంగ్లండ్ బౌలర్లు కూడా టెస్టుల్లో గొప్పగా రాణిస్తున్నారు. ముందుగా చెప్పినట్లు టీ20, వన్డే క్రికెట్‌లో మాత్రం బుమ్రాకు తిరుగులేదు.
భారత కెప్టెన్ ఎవరైనా జట్టు కష్టాల్లో ఉన్నదని భావిస్తే.. అప్పుడు బుమ్రా చేతికే బంతినిస్తారు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా న్యూయార్క్‌లో భారత్‌తో మ్యాచ్‌లో చాలా మటుకు పాకిస్తాన్ మెరుగైన స్థితిలోనే ఉంది. రన్‌రేటు కూడా బాగానే ఉంది.
కానీ ఎప్పుడైతే బుమ్రా మహ్మద్ రిజ్వాన్‌ను అవుట్ చేశాడో అప్పుడే మ్యాచ్ మలుపు తిరిగింది. బుమ్రా ఇంపాక్ట్ ప్లేయర్. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగలడు. తన అద్భుతమైన నైపుణ్యాలతో మ్యాచ్ గెలవగలమనే నమ్మకాన్ని సహచరుల్లో నింపగలడు’’ అని వకార్ యూనిస్ ప్రశంసలు కురిపించాడు.
ఇవీ చదవండి: అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.. ఆ అవకాశాన్ని నేను లాక్కోలేను: తిలక్ వర్మ
అతడి కోసం త్యాగం చేశాడు.. సంజూ భయ్యా గొప్పోడు: అభిషేక్


