source: X
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ మిడిలార్డర్ ఆటగాడు జోస్ ఇంగ్లిస్ సెంచరీతో కదంతొక్కాడు. టెస్ట్‌ల్లో అతడికి ఇది రెండో శతకం. తొలి టెస్ట్ సెంచరీని శ్రీలంకలో చేసిన అతడు.. రెండో సెంచరీని సౌతాఫ్రికాలో బాదాడు. ఇంగ్లిస్ స్వల్ప కెరీర్‌లో మొత్తంగా ఇది ఆరో శతకం. టెస్ట్‌ల్లో రెండింటితో పాటు వన్డే, టీ20ల్లోనూ తలో రెండు శతకాలు బాదాడు.
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లిస్ సెంచరీ చేశాడు. 135 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లిస్‌తో పాటు అలెక్స్ క్యారీ (80), కెమరూన్ గ్రీన్ (65), మ్యాట్ రెన్షా (74) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ మూడో రోజు తొలి సెషన్ నడుస్తుండగా 7 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.
కూపర్ కన్నోల్లీ (12), మిచెల్ స్టార్క్ (7) క్రీజ్‌లో ఉన్నారు. మిగతా ఆసీస్ ప్లేయర్లలో ట్రవిస్ హెడ్ 41, లబూషేన్, కమిన్స్ డకౌట్ అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు తీయగా.. యాన్సెన్ 2, రబాడ ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్ (78), అకెర్‌మన్ (95), బెడింగ్హమ్ (50), యాన్సెన్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. రికెల్టన్ 42, బ్రీట్జ్కీ 2 పరుగులు చేయగా.. బవుమా, ముల్దర్, కొయెట్జీ, రబాడ డకౌట్లయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, హాజిల్‌వుడ్, కన్నోల్లీ తలో వికెట్ తీశారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: విండీస్ స్పిన్నర్ రికార్డు ప్రదర్శన


