దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానున్న నిర్ణయాత్మక మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రీఎంట్రీలో నిరాశపరిచిన ఓపెనర్ నిక్ మ్యాడిన్సన్ ను స్క్వాడ్ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది.
అతడితో పాటు వికెట్ కీపర్ సామ్ హర్పర్‌ను ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేయాలని ఆసీస్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. అయితే రెండో టెస్టులో గాయపడిన స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. మెడ గాయం నుంచి స్మిత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
మూడో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో స్మిత్ కేవలం 20 నిమిషాలు మాత్రమే పాల్గొన్నట్లు ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపాడు. కోచ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అతడు కీలకమైన మూడో టెస్టులో ఆడేది అనుమానమే.
మ్యాడిన్సన్‌పై వేటు
కెమెరాన్ గ్రీన్ గాయపడటంతో ఆఖరి నిమిషంలో పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన నిక్ మ్యాడిన్సన్ ఓపెనర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే గ్వెబెరా టెస్టుతో కలిపి గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారు.
అతడు షెఫీల్డ్ షీల్డ్ డొమెస్టిక్ టోర్నీలో ఆడి ఫామ్ అందుకోవాలని హెడ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశాడు. ఇక తొలి రెండు టెస్టులకు దూరమైన గ్రీన్, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టుతో కలిశారు. వీరిద్దరూ మూడో టెస్టులో ఆడే అవకాశముంది.
3వ టెస్టుకు ఆస్ట్రేలియా అప్‌డేటడ్ స్క్వాడ్
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కూపర్ కానలీ, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లయాన్, మైఖేల్ నేసర్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.


