PC: CA/Instagram
ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై స్పందించాడు. సిడ్నీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన అతడు.. తన భార్య రెబెకాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు.
మనసులో ఏదీ దాచుకోదు
అయితే, రెబెకా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుందని.. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఆరోపణలు ఆమెను తీవ్రంగా బాధించినందున తనతో కాస్త గట్టిగానే వాదించిందని కమిన్స్ పేర్కొన్నాడు. ఉస్మాన్ ఆసీస్ జట్టు గురించి చేసిన ఆరోపణలపై స్పందించమని తనతో వాదించిందని తెలిపాడు. అంతేతప్ప తమ మధ్య గొడవలేమీ లేవని స్పష్టం చేశాడు.
ఉస్మాన్ ఖవాజా సంచలన ఆరోపణలు
కాగా ఆసీస్ మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఎనిమిదేళ్ల క్రితం నాటి సాండ్‌పేపర్ (బాల్ టాంపరింగ్) వివాదం గురించి తన పుస్తకం ‘సబర్’లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టులో బంతి ఆకారం మార్చేందుకు సాండ్‌పేపర్ వాడే విషయం జట్టులో అందరికీ తెలుసునని.. కానీ అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బౌలర్ బాన్‌క్రాఫ్ట్ మాత్రమే బలిపశువులు అయ్యారని ఆరోపించాడు.
వార్నర్ మద్దతు
కమిన్స్‌తో సహా బౌలింగ్ విభాగం మొత్తానికి ఈ విషయం గురించి తెలుసునని ఉజ్జీ పేర్కొన్నాడు. అంతేకాదు.. అంతకుముందు మ్యాచ్‌లోనూ బాల్ టాంపరింగ్ చేసేందుకు తమ జట్టు ప్రయత్నించిందంటూ బాంబు పేల్చాడు. దీంతో ఆసీస్ క్రికెట్‌లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అతడికి బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ వార్నర్ మద్దతు కూడా లభించింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత కెప్టెన్ కమిన్స్ స్పందించాలని అతడి భార్య రెబెకా కోరుకుంది. ఈ విషయం గురించి ఇద్దరూ ఇంటిబయట మాట్లాడుకుంటున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది.
రెబెకాకు అన్నీ తెలుసు
ఇక ఆ మరుసటి రోజే కమిన్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉస్మాన్ ఖవాజాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాల్ టాంపరింగ్ గురించి అతడు రాసినవన్నీ అబద్ధాలే అని కొట్టిపారేశాడు. చెత్త వాగటం సరికాదని.. ఆసీస్ క్రికెట్ ప్రతిష్ట దిగజార్చేందుకే ఇలా చేశాడని మండిపడ్డాడు.
తన భార్యకు కూడా ఈ విషయాలు తెలుసునని.. అందుకే ఖవాజా అబద్ధాలు తట్టుకోలేక తీవ్ర అసహనంతో తనతో అలా మాట్లాడిందని కమిన్స్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో రెబెకా భర్త కమిన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
అందుకే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను
అతడు మీడియాతో మాట్లాడిన ఫొటోను పంచుకుంటూ.. ‘‘మరోసారి ఇలా!.. నేను చెప్పలేనంత గర్వంగా ఉన్నాను. ఈ మనిషి మనోధైర్యం, నాయకత్వ లక్షణం నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. నువ్వు ఇలాంటోడివని తెలుసు. అందుకే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను’’ అని రెబెకా ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
ఇదీ చదవండి: హెన్రీ గొప్పగా ఏం ఆడలేదు.. ఇలా అయితే వరల్డ్‌కప్‌లో మాకు కష్టమే: గంభీర్


