Photo Credit: Twitter
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన కొత్త ఆత్మకథ 'సబర్' (Sabr)లో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపెడుతూ వస్తున్నాడు. సాండ్‌పేపర్ గేట్ వివాదం మరవక ముందే 2023లో యాషెస్ సిరీస్ సమయంలో లార్డ్స్ మైదానంలో తనకు ఎదురైన జాతి వివక్ష అనుభవాన్ని తాజాగా ఉస్మాన్ ఖవాజా పంచుకున్నాడు.
ఒక ఎంసీసీ సభ్యుడు వచ్చి "నోరు మూయ్.. నువ్వొక పాకిస్తానీ" (Shut up, you Paki) అని గట్టిగా అరిచాడని పేర్కొన్నాడు. అలా తనపై జాతివివక్ష వ్యాఖ్యలకు పాల్పాడ్డారని ఖవాజా చెప్పుకొచ్చాడు.
విషయంలోకి వెళితే.. 2023లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ ఐదో రోజున, ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ స్టంపౌట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. లంచ్ విరామ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు లార్డ్స్ పెవిలియన్‌లోని 'లాంగ్ రూమ్' గుండా వెళ్తుండగా, మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) సభ్యులు ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో దూషణలకు దిగారు.
ఆ సమయంలో ఒక ఎంసీసీ సభ్యుడు తన చెవిలో గట్టిగా అరిచాడని, దానికి తాను అభ్యంతరం చెప్పబోగా, మరొకరు తనను ఉద్దేశించి "నోరు మూయ్.. నువ్వొక పాకిస్తానీ" అంటూ జాతి వివక్షపూరిత దూషణ చేశాడని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఆ మాట వినగానే తాను తీవ్ర ఆగ్రహానికి గురై, భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణలు చెప్పింది. దోషులుగా తేలిన ముగ్గురు సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఒకరిని శాశ్వతంగా బహిష్కరించింది, మరో ఇద్దరిపై సస్పెన్షన్ విధించింది.
ఇటీవల విడుదలైన 'సబర్' (Sabr) ఆత్మకథలో ఖవాజా కేవలం లార్డ్స్ ఘటన మాత్రమే కాకుండా, 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లోని బాల్ ట్యాంపరింగ్ (Sandpapergate) వివాదం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లకు మాత్రమే కాకుండా, ఆ విషయం జట్టులోని అందరికీ తెలుసని పేర్కొనడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: ఒక్క సెంచరీతో డబుల్ రికార్డులు కొల్లగొట్టిన లంక బ్యాటర్


