source: BCCI X
టీమిండియా మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి టీమిండియా తరఫున కాకుండా యూఏఈ జట్టు ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
భారత్ తరఫున ఏడు టెస్టులు ఆడిన 33 ఏళ్ల భరత్.. యూఏఈ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన తదుపరి లక్ష్యమని వెల్లడించినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.సదరు కథనాల ప్రకారం భరత్ ఇలా అన్నాడు.
"దేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం అనేది అత్యంత గొప్ప అనుభూతి. దానికి మించినది ఏదీ ఉండదు. అయితే ఒక క్రికెటర్‌గా ఎప్పుడూ ఆటలో కొనసాగాలని, మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటాం. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నేను నిలకడగా రాణిస్తున్నాను. నాలో ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఆడే సత్తా ఉందని భావించాను. అందుకే జూన్‌లో కఠినమైన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాను" అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న భరత్.. యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఇందుకోసం అవసరమైన కూలింగ్ ఆఫ్ పీరియడ్ పూర్తికావాల్సి ఉంది.
"నిజం చెప్పాలంటే అదే నా ప్రణాళిక. ప్రస్తుతం కూలింగ్ ఆఫ్ పీరియడ్ పూర్తి చేయాల్సి ఉంది. ఫిబ్రవరిలో అది ముగుస్తుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళికల గురించి మరింత స్పష్టంగా చెప్పగలను" అని వెల్లడించాడు.
కాగా, భరత్ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లలో ఆడేందుకు అతడికి అవకాశం లభించింది. ప్రస్తుతం అతడు అబుదాబి టీ10 లీగ్‌లో ఎమిరేట్స్ ఈగిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్ పూర్తి


