న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు పలువురు టెస్ట్ స్పెషలిస్టులు వన్డే జట్టు నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఆ మ్యాచ్‌లలో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు దక్కనున్నాయి.
శుభ్‌మన్ గిల్ స్థానంలో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
చివరి రెండు వన్డేల్లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టెస్ట్ సిరీస్ సన్నాహాల కోసం వన్డే జట్టుకు దూరం కావడంతో అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
వైస్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
చివరి రెండు వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండటంతో ఇషాన్ కిషన్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కేఎల్ రాహుల్ టెస్ట్ సన్నాహాల కోసం వన్డే జట్టుకు దూరం కావడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా ఇషాన్‌కే దక్కనున్నాయి. గిల్ లేకపోవడంతో ఇషాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది.
కేఎల్ రాహుల్ స్థానంలో కుమార్ కుషాగ్రా
యువ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రాకు వన్డే జట్టులో చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు భారత్-ఏ తరఫున నిలకడగా రాణించడం అతడికి కలిసొచ్చింది. ఇషాన్ కిషన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా కుషాగ్రా వ్యవహరించనున్నాడు.
ఫినిషర్‌గా తిలక్ వర్మకు అవకాశం
భారత యువ బ్యాటర్ తిలక్ వర్మకు కూడా వన్డే జట్టులో చోటు కల్పించారు. చివరి రెండు మ్యాచ్‌లకు బ్యాటింగ్ విభాగంలో ఖాళీలు ఏర్పడటంతో తిలక్‌కు అవకాశం లభించింది. టీ20ల్లో ఫినిషర్‌గా రాణిస్తున్న అతడిని ఐదు లేదా ఆరో స్థానంలో ఆడించే అవకాశం ఉంది.
అన్షుల్ కాంబోజ్ స్థానంలో యశ్ ఠాకూర్
బౌలింగ్ విభాగంలోనూ భారత్ మార్పులు చేసింది. టెస్ట్ జట్టుకు వెళ్లనున్న అన్షుల్ కాంబోజ్ స్థానంలో యశ్ ఠాకూర్‌కు అవకాశం కల్పించింది. 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరఫున యశ్ ఠాకూర్ అద్భుతంగా రాణించాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.
కాగా, ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. హామిల్టన్‌లో జరగాల్సిన మూడో వన్డే టాస్ అనంతరం వర్షం కారణంగా రద్దయింది. నాలుగు, ఐదు వన్డేలు మౌంట్ మాంగనూయ్ వేదికగా నవంబర్ 15, 19 తేదీల్లో జరుగనున్నాయి.
ఇదీ చదవండి: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన


