source: X
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరో కీలక బాధ్యత దక్కింది. 2026 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం అతడిని కేరళ జట్టు కెప్టెన్‌గా నియమించారు. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన జట్టును కేరళ క్రికెట్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది.
గతేడాది కూడా సంజూ శాంసన్ కేరళ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే ఆ టోర్నీలో ఎలైట్ గ్రూప్-ఏలో కేరళ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. సూపర్ లీగ్‌కు అర్హత సాధించలేకపోయింది. వ్యక్తిగతంగా సంజూ మాత్రం మంచి ప్రదర్శన చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 137.86 స్ట్రైక్‌రేట్‌తో 233 పరుగులు సాధించాడు. జట్టులో రోహన్ కున్నుమ్మల్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అనుభవజ్ఞులకు చోటు
ఈసారి కేరళ జట్టులో పలువురు అనుభవజ్ఞులకు అవకాశం కల్పించారు. రెడ్‌బాల్ జట్టు కెప్టెన్ విష్ణు వినోద్‌తో పాటు అతడి కంటే ముందు జట్టుకు నాయకత్వం వహించిన మహమ్మద్ అజరుద్దీన్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇటీవల రంజీ ట్రోఫీకి ముందు జట్టులోకి తిరిగి వచ్చిన వెటరన్ స్పిన్నర్ జలజ్ సక్సేనా కూడా జట్టుకు ఎంపికయ్యాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విఘ్నేశ్ పుత్తూర్‌కు కూడా చోటు లభించింది. 2018, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న కేఎం ఆసిఫ్‌ను కూడా ఎంపిక చేశారు.
నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో కేరళ తమ తొలి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడనుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో కేరళ జట్టు:
సంజూ వి. శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహన్ ఎస్. కున్నుమ్మల్, మహమ్మద్ అజరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, గోవింద్ దేవ్ డి. పై, కృష్ణ దేవన్ ఆర్.జె., విష్ణు వినోద్ (వికెట్ కీపర్), సల్మాన్ నిజార్, అఖిల్ స్కారియా, నిఖిల్ ఎం., విఘ్నేశ్ పుత్తూర్, బిజు నారాయణన్ ఎన్., కార్తీక్ బి. నాయర్, వైశాఖ్ చంద్రన్, ఆసిఫ్ కేఎం, నిధీష్ ఎం.డి., షరఫుద్దీన్ ఎన్.ఎం, జలజ్ సక్సేనా.
ఇదీ చదవండి: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన


