ఇషా బృందం పసిడి గురి | India won its second gold medal at the 2026 ISSF World Championships in Doha | Sakshi
Sakshi News home page

ఇషా బృందం పసిడి గురి

Nov 11 2026 6:06 AM | Updated on Nov 11 2026 6:06 AM

India won its second gold medal at the 2026 ISSF World Championships in Doha

దోహా: ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి ఇషా సింగ్, మను భాకర్, దివ్య సుబ్బరాజులతో కూడిన భారత జట్టు 1761 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం గెల్చుకుంది. క్వాలిఫయింగ్‌లో ఇషా 590 పాయింట్లతో మూడో స్థానంలో, మను 587 పాయింట్లతో ఆరో స్థానంలో, దివ్య 584 పాయింట్లతో పదో స్థానంలో నిలిచారు. టాప్‌–8లో నిలవడంద్వారా ఇషా, మను వ్యక్తిగత విభాగం ఫైనల్లోకి ప్రవేశించారు. క్వాలిఫయింగ్‌లో ఇషా, మను, దివ్య సాధించిన స్కోర్ల ఆధారంగా భారత్‌కు టీమ్‌ స్వర్ణం ఖరారైంది. 

దక్షిణ కొరియా (1748 పాయింట్లు) రజతం, వియత్నాం (1745 పాయింట్లు) కాంస్యం సాధించాయి. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత ఫైనల్లో ఇషా, మను నిరాశపరిచారు. ఇషా 11 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోగా... మను 27 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. జిన్‌ యాంగ్‌ (కొరియా; 44 పాయింట్లు) ప్రపంచ రికార్డు సృష్టించడంతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.  ట్రిన్‌ తు విన్‌ (వియత్నాం; 43 పాయింట్లు) రజతం, యువెయువె జాంగ్‌ (చైనా; 34 పాయింట్లు) కాంస్యం గెలిచారు. టాప్‌–3లో నిలిచిన జిన్‌ యాంగ్, ట్రిన్, యువెయువె 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లను దక్కించుకున్నారు. మరో మూడు రోజులపాటు కొనసాగే ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి తొమ్మిది పతకాలతో రెండో స్థానంలో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement