ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ వెల్లడించారు. ఈ విషయంలో ఇప్పటికే భారత్‌కు పలుమార్లు విజ్ఞప్తి లేఖలు పంపినా సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. హసీనాను తమ దేశ ట్రైబ్యునల్ దోషిగా నిర్ధారించిందని, అందువల్ల ఆమెను ఎప్పటికైనా బంగ్లాదేశ్‌కు తీసుకొచ్చి తగిన శిక్ష విధిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆమె తమ దేశ ప్రజల దృష్టిలో నేరస్థురాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అప్పగిస్తే చట్టప్రకారమే చర్యలు!
హసీనా ప్రస్తుతం మరో దేశంలో ఉన్నందున ఆమె అప్పగింత వ్యవహారాన్ని హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని అసదుజ్జమాన్ తెలిపారు. ఒకవేళ భారత్ ఆమెను అప్పగిస్తే ఎలాంటి భావోద్వేగాలకు తావివ్వకుండా చట్టప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారు. న్యాయపరమైన నిబంధనలను ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలూ తీసుకోబోమని స్పష్టం చేశారు.
హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరుతూ ఇప్పటికే దౌత్యపరమైన మార్గాల్లో ప్రయత్నాలు చేసినట్లు బంగ్లాదేశ్ వెల్లడిస్తోంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం (Extradition Treaty) ఆధారంగా ఆమెను తిరిగి పంపించాలని ఢాకా కోరుతోంది. అయితే ఈ విజ్ఞప్తులపై భారత్ తుది నిర్ణయం ప్రకటించకపోవడంతో ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. భారత్ విదేశాంగ శాఖ గతంలో బంగ్లాదేశ్ పంపిన విజ్ఞప్తులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో హసీనా అప్పగింతపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
2025లో మరణశిక్ష.. భారత్‌కు అప్పగింత విజ్ఞప్తి
హసీనాపై బంగ్లాదేశ్‌లో జరిగిన విచారణ ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. 2025 నవంబర్ 17న బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (International Crimes Tribunal) ఆమెను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ ఆమె గైర్హాజరీలో తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆమెకు ఒక అభియోగంపై మరణశిక్ష, మరో అభియోగంపై జీవిత ఖైదు విధించింది. అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్‌కు కూడా మరణశిక్ష విధించింది.
తీర్పు అనంతరం హసీనాను భారత్ నుంచి తిరిగి రప్పించేందుకు బంగ్లాదేశ్ దౌత్యపరమైన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. భారత్‌కు అధికారికంగా అప్పగింత విజ్ఞప్తులు పంపించింది. అయితే హసీనా ఈ విచారణను రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణిస్తూ ఆరోపణలను ఖండించారు. ఐక్యరాజ్యసమితి కూడా విచారణలో అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలు, న్యాయమైన విచారణ హక్కులపై ఆందోళనలు వ్యక్తం చేసింది.
భారత్ ప్లానేంటి?
ఇప్పుడు అందరి దృష్టి భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ, ఒక వ్యక్తిని అప్పగించే ప్రక్రియలో ఒప్పందంలోని నిబంధనలు, చట్టపరమైన అంశాలు, సంబంధిత అభ్యర్థనల పరిశీలన కీలకంగా ఉంటాయి. బంగ్లాదేశ్ మాత్రం హసీనాను తిరిగి తీసుకురావాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు భారత్ ఈ వ్యవహారంపై తన దౌత్య, న్యాయపరమైన ప్రక్రియలను అనుసరిస్తోంది. మొత్తంగా చూస్తే.. షేక్ హసీనా అప్పగింత వ్యవహారం కేవలం ఒక మాజీ ప్రధానమంత్రి స్వదేశానికి తిరిగి రావడానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు, దౌత్యపరమైన నిర్ణయాలు, అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలతో ముడిపడిన అత్యంత కీలకమైన వ్యవహారంగా మారింది. హసీనాను భారత్ అప్పగిస్తుందా? లేక ఆమె భారత్‌లోనే కొనసాగుతారా? అన్నది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.
ఇదీ చదవండి: సౌదీ గుండెల్లో గుబులు.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు!


