ఇజ్రాయెల్‌లో ఐసెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? | Will Eisenkot be able to form Israels next govt amid divided opposition | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో ఐసెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?

Nov 8 2026 7:53 PM | Updated on Nov 8 2026 7:57 PM

Will Eisenkot be able to form Israels next govt amid divided opposition
  • 100 రోజుల ప్రక్రియ ముగిసినా ప్రభుత్వం ఏర్పడకపోతే.. 
  • ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం
  • గాడి ఐసెన్‌కాట్‌కు పరీక్ష.. సవాళ్లు
  • ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు

ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కాట్‌కు లభించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంలో ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా జాతీయ భద్రత, మతపరమైన అంశాలు, పాలస్తీనా భూభాగాల ఆక్రమణపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఐసెన్‌కాట్‌కు పరీక్షగా నిలిచింది.

అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమి పార్లమెంటులో మెజారిటీ కోల్పోయింది. దీంతో ఆయన సుదీర్ఘ పాలనకు ముగింపు పలికే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం శనివారం మాజీ సైనికాధికారి ఐసెన్‌కాట్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనకు 28 రోజుల గడువు ఇచ్చారు. ఈ సమయంలో విఫలమైతే మరో 14 రోజుల పొడిగింపు కోరవచ్చు. జషర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న 66 ఏళ్ల ఐసెన్‌కాట్.. ‘‘ఇప్పుడు జాతీయ అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన సమయం. దానికి మేం అర్హులమని నిరూపించేందుకు నా వంతు కృషి చేస్తాను’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ పార్లమెంటు నెసెట్‌లో మొత్తం 120 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. ఐసెన్‌కాట్‌కు చెందిన జషర్ పార్టీకి 21 స్థానాలు ఉన్నాయి. యాయిర్ గోలన్ నేతృత్వంలోని డెమోక్రాట్స్, నఫ్తాలీ బెన్నెట్‌కు చెందిన టుగెదర్ పార్టీ, అవిగ్డోర్ లీబర్‌మన్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ అవర్ హోమ్ పార్టీలు కలిపి ప్రతిపక్ష కూటమికి మొత్తం 48 స్థానాలు ఉన్నాయి.

మరోవైపు అరబ్ పార్టీలైన రామ్ (యునైటెడ్ లిస్ట్), జాయింట్ లిస్ట్‌కు కలిపి 19 స్థానాలున్నాయి. జాయింట్ లిస్ట్‌లో హదాష్, తాల్, బలాద్ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు ఐసెన్‌కాట్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. వీటి మద్దతు లభిస్తే నెతన్యాహు వ్యతిరేక శిబిరం బలం 67 స్థానాలకు చేరుతుంది. అయితే అరబ్ పార్టీలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేర్చుకునేందుకు ఐసెన్‌కాట్ నిరాకరించారు. వాటి మద్దతుపై ఆధారపడే మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికీ లీబర్‌మన్ వ్యతిరేకిస్తున్నారు. గోలన్ మాత్రం అరబ్ పార్టీలతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. ‘‘యూదుల ఓట్లు, అరబ్బుల ఓట్ల మధ్య నెతన్యాహు సృష్టించిన జాత్యహంకార విభజనను ఇకపై అంగీకరించకూడదు’’ అని ఆయన ఎన్నికల అనంతరం వ్యాఖ్యానించారు.

నెతన్యాహు కూటమి పరిస్థితి 
నెతన్యాహు కూటమి గురించి చెప్పుకుంటే.. 2022లో 64 స్థానాలు సాధించిన ఆయన మత జాతీయవాద కూటమి తాజా ఎన్నికల్లో 53 స్థానాలకే పరిమితమైంది. ఆయన లికుడ్ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద ఏకైక పార్టీగా నిలవగా, ఐసెన్‌కాట్ జషర్ పార్టీకి 21 స్థానాలు వచ్చాయి. దీర్ఘకాల మిత్రపక్షమైన యునైటెడ్ తోరా జుడాయిజం పార్టీ అధ్యక్షుడి సంప్రదింపుల్లో నెతన్యాహుకు గానీ, మరే ఇతర అభ్యర్థికి గానీ మద్దతు ప్రకటించలేదు. అయితే భవిష్యత్తులో తమ డిమాండ్లు నెరవేరితే నెతన్యాహుకు మద్దతిచ్చే అవకాశాన్ని ఆ పార్టీ పూర్తిగా తోసిపుచ్చలేదు. ముఖ్యంగా అల్ట్రా ఆర్థడాక్స్ యూదులకు తప్పనిసరి సైనిక సేవ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నది వారి ప్రధాన డిమాండ్.

ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర మార్గాలు
అరబ్ పార్టీల బయటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఐసెన్‌కాట్ ముందున్న ఒక మార్గం. ఈ విధానంలో అరబ్ పార్టీలు మంత్రివర్గంలో చేరాల్సిన అవసరం లేదు. పార్లమెంటులో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా విధానపరమైన రాయితీలు కోరవచ్చు. 2021లో నఫ్తాలీ బెన్నెట్ ప్రభుత్వంలో రామ్ పార్టీ చేరింది. ఇజ్రాయెల్ ప్రభుత్వ కూటమిలో స్వతంత్ర అరబ్ పార్టీ భాగస్వామి కావడం అదే తొలిసారి. అయితే ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ స్థిర నివాసాలు, పాలస్తీనా దేశ ఏర్పాటు అంశాలపై విభేదాలతో ఆ ప్రభుత్వం 18 నెలల్లోనే కూలిపోయింది.

మరో మార్గంగా అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీలైన షాస్, యునైటెడ్ తోరా జుడాయిజంలను తన కూటమిలో చేర్చుకోవచ్చు. వీటికి కలిపి 13 స్థానాలున్నాయి. దీంతో ఐసెన్‌కాట్ కూటమి బలం 61కి చేరుతుంది. అయితే మత విద్యార్థులకు సైనిక సేవ నుంచి మినహాయింపుల విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. మరోవైపు నెతన్యాహు లికుడ్ పార్టీతో కలిసి ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ ఉంది. అలా చేస్తే 67 స్థానాల మద్దతు లభిస్తుంది. కానీ నెతన్యాహును అధికారంలో నుంచి తొలగిస్తామన్న ఎన్నికల హామీని ఐసెన్‌కాట్ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది.

ఐసెన్‌కాట్ విఫలమైతే నెతన్యాహుకు మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వవచ్చు. ఇద్దరూ విఫలమైతే పార్లమెంటు మరో అభ్యర్థిని ఎంపిక చేయవచ్చు. 100 రోజుల ప్రక్రియ ముగిసినా ప్రభుత్వం ఏర్పడకపోతే ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.

పాలస్తీనా విధానంలో మార్పు ఉంటుందా?
లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయానికి చెందిన న్యాయశాస్త్ర ఆచార్యుడు నెవ్ గోర్డన్ అభిప్రాయం ప్రకారం.. ఐసెన్‌కాట్ ప్రభుత్వం ఏర్పడితే నెతన్యాహు తీసుకొచ్చిన న్యాయవ్యవస్థ సంస్కరణల్లో కొన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక విధానానికి సంబంధించిన చట్టాలను రద్దు చేయవచ్చని ఆయన అంచనా వేశారు. అక్టోబర్ 7 దాడులపై స్వతంత్ర విచారణకు ఆదేశించడంతోపాటు, తీవ్రమైన నేరాలపై విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు ప్రధాని పదవి చేపట్టకుండా చట్టం తీసుకురావచ్చని పేర్కొన్నారు.

అరబ్ పార్టీల బయటి మద్దతు లభిస్తే ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా పట్టణాలకు నిధులు కేటాయించడం, నిర్లక్ష్యానికి గురైన మౌలిక సదుపాయాలు, పాఠశాలల అభివృద్ధి, నేరాల నియంత్రణకు పోలీసు వ్యవస్థపై ఖర్చు పెంచడం వంటి చర్యలు ఉండవచ్చని గోర్డన్ తెలిపారు.

అయితే గాజా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసెన్‌కాట్ కూటమిలో ఆధిపత్యం కుడిపక్ష పార్టీలదేనని, అవి పాలస్తీనా స్వతంత్ర దేశ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. గాజా విధానంలో భారీ మార్పులు కనిపించవని పేర్కొన్నారు.

అందువల్ల ఐసెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా అన్నదానితోపాటు, అరబ్ పార్టీల మద్దతు, మతపరమైన పార్టీలతో రాజీ, నెతన్యాహుతో ఐక్యత వంటి అంశాలపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకం. ఈ చర్చలే ఇజ్రాయెల్ తదుపరి ప్రధాని ఎవరు, దేశ అంతర్గత విధానాలు ఎలా ఉండబోతున్నాయో నిర్ణయించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement