ఇరాన్‌ దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి.. మరో కొత్త మెలిక! | Iran Sends Proposal To US With 7 Conditions | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి.. మరో కొత్త మెలిక!

Nov 6 2026 9:17 AM | Updated on Nov 6 2026 9:23 AM

Iran Sends Proposal To US With 7 Conditions

వాషింగ్టన్‌: ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంటే.. మరోవైపు ఇరాన్‌ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. యుద్ధానికి ముగింపు పలకడానికి సిద్ధమేనని సంకేతాలిస్తూనే, తమ డిమాండ్లకు అమెరికా అంగీకరించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో ఖతార్‌ మధ్యవర్తిత్వంతో అమెరికాకు కొత్త అణు ప్రతిపాదనను పంపినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ వెల్లడించింది. అయితే ఈ ప్రతిపాదనపై చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా తమ ఏడు షరతులను నెరవేర్చాలని ఇరాన్‌ తేల్చిచెప్పింది. దీంతో ఇరాన్‌ తాజా ప్రతిపాదనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి రాయిటర్స్‌కు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖతార్‌ ద్వారా అణు ప్రతిపాదనను అమెరికాకు పంపించారు. ఈ ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. అయితే ప్రతిపాదనలోని పూర్తి వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. మరోవైపు అమెరికా మాత్రం ఏదైనా ప్రాథమిక చర్చలు ప్రారంభమైతే అందులో ఇరాన్‌ అణు కార్యక్రమం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేస్తోంది. అంటే ఇరాన్‌ ముందుగా తమ షరతులు నెరవేర్చాలని పట్టుబడుతుండగా, అణు అంశాన్ని చర్చల ప్రారంభంలోనే చేర్చాలని అమెరికా కోరుతోంది. ఈ రెండు దేశాల వైఖరుల మధ్యే ప్రస్తుతం దౌత్యపరమైన ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

ఇరాన్‌ ఏడు షరతులేంటి?
ఇరాన్‌ అత్యున్నత భద్రతా అధికారి మొహ్సెన్‌ రెజాయీ ఈ వారం రష్యా పర్యటన సందర్భంగా అమెరికాకు ఏడు షరతులు విధించినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘దౌత్యపరమైన చర్చల విషయంలో అమెరికాకు మా ఏడు షరతులను ఇప్పటికే తెలియజేశాం. వాటిని అమలు చేసే వరకు హార్ముజ్‌ జలసంధిని తెరవం. చర్చలకు కూడా అంగీకరించం’ అని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్‌ ఏడు డిమాండ్లు..

  • యుద్ధానికి పూర్తిగా ముగింపు: ఇరాన్‌తో పాటు లెబనాన్‌ సహా ఇతర ప్రాంతాల్లోనూ సైనిక దాడులు నిలిపివేయాలి.

  • నౌకాదళ దిగ్బంధం ఎత్తివేత: ఇరాన్‌ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించాలి.

  • ఆంక్షల తొలగింపు: ఇరాన్‌పై విధించిన అమెరికా ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలి.

  • స్తంభింపజేసిన ఆస్తుల విడుదల: విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్‌ నిధులను తిరిగి అప్పగించాలి.

  • అమెరికా సైనిక ఉనికి తగ్గింపు: మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాల సంఖ్యను తగ్గించాలి.

  • యుద్ధ నష్టపరిహారం: యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలి.

  • ఇరాన్‌పై దాడులకు ముగింపు: ఇరాన్‌ భూభాగంపై అమెరికా సైనిక దాడులు, జోక్యాన్ని నిలిపివేయాలి.


ట్రంప్‌ హెచ్చరికలు.. ఇరాన్‌ ప్రతిఘటన!
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై తన వైఖరిని మరింత కఠినతరం చేస్తున్నారు. ఇరాన్‌లో మిగిలిన ప్రాంతాలను కూడా ధ్వంసం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల అనంతరం మళ్లీ సైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని కూడా ఆయన తోసిపుచ్చడం లేదు. కాగా, ఇరాన్‌ తాజాగా అణు ప్రతిపాదన పంపడం, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో దౌత్య ప్రయత్నాలు వేగవంతం కావడం కొంత ఆశాజనక పరిణామంగా కనిపిస్తున్నాయి. అయితే అమెరికా, ఇరాన్‌ మధ్య ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. మధ్యంతర ఎన్నికల తర్వాత మళ్లీ సైనిక చర్యలు ప్రారంభమయ్యే అవకాశాన్ని ట్రంప్‌ పూర్తిగా తోసిపుచ్చడం లేదు. మరోవైపు యుద్ధం తిరిగి ప్రారంభమైతే మరింత విస్తృత స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్‌ హెచ్చరిస్తోంది.

మొత్తానికి.. ఇరాన్‌ అణు ప్రతిపాదన పంపినా, ముందుగా ఏడు షరతులకు అమెరికా అంగీకరించాలన్న పట్టుదలతో ఉంది. ట్రంప్‌ సైనిక హెచ్చరికలు, ఇరాన్‌ దౌత్యపరమైన ఒత్తిళ్ల మధ్య ఇప్పుడు బంతి అమెరికా కోర్టులో ఉంది. ఈ ప్రతిపాదనతో యుద్ధానికి తెరపడుతుందా? లేక మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ జ్వాలలు ఎగసిపడతాయా? అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఇదీ చదవండి: భారతీయుల దెబ్బ.. ట్రంప్‌కు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement