టార్గెట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌!  | Democrats plan investigations into Donald Trump family business deals | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌! 

Nov 6 2026 6:05 AM | Updated on Nov 6 2026 6:06 AM

Democrats plan investigations into Donald Trump family business deals

అధ్యక్షుని ‘అవినీతి’పై విచారణ 

అస్త్రశ్రస్తాలకు డెమొక్రాట్ల పదును 

‘మధ్యంతర’గెలుపుతో దూకుడు 

ఐదు అంశాలతో ఎజెండా సిద్ధం 

సమన్లతో పాటు ‘అభిశంసన’!

వాషింగ్టన్‌: అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికల్లో నెగ్గి దూకుడు మీదున్న డెమొక్రాట్లు జోరు మరింత పెంచనున్నారు. ఎన్నికల్లో కీలకాంశంగా నిలిచిన అవినీతినే అధికార రిపబ్లికన్‌ పార్టీపై తిరుగులేని అస్త్రంగా ప్రయోగించాలని నిర్ణయించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలను లక్ష్యం చేసుకోనున్నారు. 

కాంగ్రెస్‌ (దేశ పార్లమెంటు)లోని ఉభయ సభల్లోనూ కొత్తగా అందివచ్చిన అధికారాన్ని ఇందుకోసం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డెమొక్రటిక్‌ పార్టీ నిర్ణయించింది. ఆ దిశగా ఐదంశాలతో ఏకంగా భారీ ఎజెండానే సిద్ధం చేసుకుంటోంది! అవసరమైతే ట్రంప్‌ అభిశంసనకు కూడా వెనకాడబోమని ప్రతినిధుల సభ స్పీకర్‌ అవుతారని భావిస్తున్న హకీం జెఫ్రీస్‌ ఇప్పటికే సంకేతాలిచ్చారు కూడా!! 

రెండోసారి అధికారాన్ని చేపట్టిన నాటినుంచీ ట్రంప్, ఆయన కుటుంబ ఆస్తులు అపారంగా పెరిగాయన్నది డెమొక్రాట్ల ప్రధాన ఆరోపణ. అవినీతిని పూర్తిగా కడిగిపారేయాలన్నదే మధ్యంతర ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు తాలూకు సారాంశమని డెమొక్రాట్‌ నేత చుక్‌ షెమర్‌ అభిప్రాయపడ్డారు.

 ట్రంప్‌ కుటుంబ వ్యాపార వ్యవహారాలు, వైట్‌హౌస్‌ బాల్‌ రూమ్‌తో పాటు వాషింగ్టన్‌ నలుమూలలా చేపట్టిన నిర్మాణ, రియల్టీ ప్రాజెక్టులలు, ఎప్‌స్టీన్‌ ఫైళ్లు, వలసదారులపై ఇమిగ్రేషన్‌–కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) దాడులు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) పనితీరు తదితరాలన్నీ విచారణ పరిధిలోకి రానున్నట్టు పార్టీ నేతలు గార్షియా, జరేద్‌ హాఫ్‌మన్‌ తదితరులు వెల్లడించారు. ఇందుకోసం అవసరమైతే ‘సమన్ల జారీ’అధికారాన్ని కూడా వాడుకునేలా డెమొక్రాట్లు పథక రచన చేస్తున్నారు.

 చట్టసభలను ట్రంప్‌ యంత్రాంగం తమ సొంత సంస్థల్లా వాడుకున్న రోజులకు కాలం చెల్లిందని జెఫ్రీస్‌ అన్నారు. మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ఓటర్లు ట్రంప్‌కు కర్రుగాల్చి వాత పెట్టడం తెలిసిందే. అవినీతి పెద్ద సమస్యగా మారినట్టు సగానికి సగం మంది ఓటర్లు పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాలేదని ప్రతి 10 మంది ఓటర్లలోనూ నలుగురికి పైగా, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ముగ్గురు కుండబద్దలు కొట్టారు. వారిలో అత్యధికులు డెమొక్రటిక్‌ పార్టీకే ఓటేయడంతో రిపబ్లికన్‌ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకోవాల్సి వచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement