ఒక గెలుపు... ఒక ఓటమి..
సందర్భం
ఇద్దరూ తెలుగు మూలాలు ఉన్న మహిళలే. అమెరికా మధ్యంతర ఎన్నికలలో హైదరాబాదీ మూలాలు ఉన్న అరుణా మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రెండోసారి ఎంపికయ్యారు. కరీంనగర్ మూలాలు ఉన్న సరితా కోమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం పోటీ పడి ఓటమి చెందారు. గెలుపు, ఓటముల సంగతి ఎలా ఉన్నా... ఈ ఇద్దరు మహిళలకు సామీప్యత ఉంది. అయితే అది భౌగోళిక, సాంస్కృతిక సామీప్యత కాదు. కష్టపడి పనిచేయడం నుంచి పట్టుదల వరకు, అంకితభావం నుంచి సంకల్పబలం ఇద్దరికీ ఎలాంటి భేదం లేదు...
‘ఆలోచనాపరురాలు, కష్టపడి పనిచేసేవారు, మంచి మనసు ఉన్న వారు, సమాజానికి మంచి చేయాలనుకునేవారు, ఇతరుల పట్ల సానూభూతి చూపేవారు, కుతూహలంతో ఉండేవారు, తెలివైనవారు. ప్రజాసేవకురాలిలో నేను కోరుకునే అన్ని లక్షణాలు ఆమెలో ఉన్నాయి’ అరుణను ఉద్దేశించి అమెరికన్ రాజకీయవేత్త గరాగియోలా అన్నారు. ‘యాక్సిడెంటల్ పొలిటీషియన్’గా పిలుచుకునే అరుణా మిల్లర్ స్వ‘గతం’...
అమ్మో... ఆరోజు!
స్వదేశం భారత్ నుంచి న్యూయార్క్‌లోని పౌకీప్సీకి వచ్చాం. అప్పుడు నా వయసు ఏడేళ్లు. స్కూల్‌లో నా మొదటి రోజు గురించి చెప్పాలి. అక్కడ ఎవరూ నాలా లేరు. పైగా నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. అయినప్పటికీ నేను వారితో కలిసిపోవాలనుకున్నాను. స్కూల్ క్యాంటీన్‌లో మిగతా పిల్లలు ఏంచేస్తే నేనూ అదే చేయాలనుకున్నాను. మొదటిసారిగా అమెరికన్ ఫుడ్ తిన్నాను. ఎప్పుడూ లేనిది మొదటిసారిగా చల్లని పాలు తాగాను. అప్పుడు అంతా బాగానే అనిపించింది. క్లాస్‌రూమ్‌కు వెళ్లిన తరువాత తిన్నదంతా వాంతి చేసుకున్నాను! చాలా సిగ్గుగా అనిపించింది. టీచర్ మా అమ్మకు ఫోన్ చేశారు. అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లేదారిలో అమ్మతో ‘నన్ను అమ్మమ్మ (ఇండియాలో ఉన్నారు) దగ్గరికి తీసుకెళ్లు. ఈ చల్లని పాలు నాకు అస్సలు బాగలేవు’ అని చెప్పాను.
గెలవగలనా? యస్... గెలిచాను!
హౌజ్ ఆఫ్ డెలిగేట్స్‌లో ఒక స్థానం ఖాళీ అయినప్పుడు దానికి పోటీ చేసే అవకాశాన్ని మొదట తిరస్కరించాను. ఎందుకంటే ఒక నల్ల జాతి మహిళకు ఓటు వేస్తారనే నమ్మకం నాకు లేదు. ఎంతోమంది నన్ను పోటీ చేయమని ఒత్తిడి చేశారు. నా భర్త డేవిడ్ మిల్లర్ కూడా అడిగారు.
‘నేను ఇంజినీర్‌ను. పొలిటీషియన్‌ను కాదు’ అన్నాను. అందుకు ఆయన...
‘ఎన్నికల్లో పోటీ చేయడాన్ని రాజకీయ కోణం నుంచి చూడొద్దు. నీకు ప్రజాసేవ అంటే ఇష్టం కదా! ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు?’ అన్నారు.
‘ఒకవేళ నేను ఓడిపోతే?’ అని అడిగాను. ‘ఒకవేళ నువ్వు గెలిస్తే?’ అన్నారు మిల్లర్. నాకు అలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఓడిపోతానని మాత్రమే నాకు అనిపించింది. అయితే నేను ఓడిపోలేదు! నేను మొదటిసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు నాకు ఎటువంటి రాజకీయ పరిచయాలు లేవు. సరిౖయెన వ్యక్తులతో పరిచయాలు లేవు. ఆ రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
వారే స్ఫూర్తిప్రదాతలు
క్లిష్ట పరిస్థితులలో నేను కలిసిన వ్యక్తుల నుంచే నాకు స్ఫూర్తి లభించింది. వీరు స్వచ్ఛంద సేవకులు, ఉద్యమకారులు. తాము నమ్మిన ఆశయం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పోరాడే వ్యక్తులు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయరు. అలాంటి వారే నాకు స్ఫూర్తి.
ఫ్యామిలీ సపోర్ట్
నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు పెద్ద కూతురు కాలేజీలో, రెండో కూతురు హైస్కూల్, మూడో కూతురు మిడిల్ స్కూల్‌లో చదువుతున్నారు. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు. ఆ ప్రయాణంలో అందరూ భాగమవుతారు. నా విషయంలోనూ అదే జరిగింది. ప్రేమ గల భర్త, తోడుగా ఎప్పుడూ మా అమ్మ ఉండడం నా అదృష్టం. 1999 నుండి అమ్మ మాతోనే ఉంటున్నారు. ఆమె పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. అమ్మ నాతో ఉండడం నాకే కాదు పిల్లలకూ మేలు చేసింది. నేను అందుబాటులో లేని సమయాల్లో మా అమ్మ నేను లేని లోటు తీరుస్తుంది.
పవర్‌ఫుల్ ప్రాసిక్యూటర్
‘పెద్ద కలలు కనండి. కష్టపడి పనిచేయండి. మీ కలలను సాకారం చేసుకోండి’ అంటారు సరితా కోమటిరెడ్డి. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలానికి చెందిన హనుమంతరెడ్డి, గీతారెడ్డి సరిత తల్లిదండ్రులు. ఇద్దరూ వైద్యులే. ఎన్నో దశాబ్దాల క్రితం హనుమంతరెడ్డి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ‘మా నాన్న భారతదేశంలోని చిన్న గ్రామం నుంచి వచ్చారు. అక్కడ నీటిసరఫరా కూడా సరిగా ఉండేది కాదు. చాలామంది అమెరికాకు ఎందుకు వస్తారో ఆ కారణంతోనే ఆయన ఇక్కడికి వచ్చారు’ అన్నారు సరిత.
గర్వించేలా... ఎన్నో హోదాలలో!
హార్వర్డ్ లా స్కూల్ నుండి పట్టభద్రురాలైన తరువాత ‘హార్వర్డ్ లా రివ్యూ’కు బ్లూబుక్ ఛైర్(ఎడిటర్)గా పనిచేశారు సరిత. న్యూయార్క్‌లోని యు.ఎస్. అటార్ని కార్యాలయంలో చేరడానికి ముందు డీప్‌వాటర్ హోరైజన్ ఆయిల్‌స్పిల్‌పై ఏర్పాటైన జాతీయకమిషన్‌కు న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఆ తరువాత కాలంలో... ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ మనీలాండరింగ్ చీఫ్‌గా, డిప్యూటి చీఫ్ ఆఫ్ జనరల్ క్రైమ్స్, కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ఎనిమిది ఫెడరల్ జ్యూరీ విచారణలను నిర్వహించారు. సెకండ్ సర్క్యూట్ ముందు పదిహేను అప్పీళ్లను వాదించారు. ఆల్‌ఖైదా, ఐసిస్, మెక్సికన్ డ్రగ్ లీడర్‌లను కోర్టు బోనులో నిలబెట్టే ప్రయత్నాలు చేశారు.
జీవితాన్ని మార్చిన సంఘటన
‘9/11 నా జీవితాన్నే మార్చేసింది. ఉగ్రవాదులను బోనులో నిలపడానికి, అమెరికాను రక్షించడానికి లా స్కూల్‌లో చేరాను’ గతాన్ని గుర్తు చేసుకున్నారు సరిత. ఒక హై– ప్రొఫైల్ కేసులో, అమెరికా సైనిక సిబ్బందిని హత్య చేయడానికి కుట్ర పన్నిన ఒక ఉగ్రవాదికి 45 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేశారు. 2020లో డోనాల్డ్ ట్రంప్ సరితను న్యూయార్క్‌లోని యూ.ఎస్. డిస్ట్రిక్ట్ కోర్టుకు నామినేట్ చేశారు.
జీవితలక్ష్యం
మూడు అటార్నీ జనరల్ అవార్డులు, ఫెడరల్ డ్రగ్ ఏజెంట్స్ ఫౌండేషన్
‘ట్రూ అమెరికన్ హీరో’ అవార్డులు రెండు, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫౌండేషన్ ‘ ప్రాసిక్యూటర్ ఆఫ్ ఇది ఇయర్’ రెండు అవార్డులను అందుకున్నారు. ‘నేరస్థులపై అభియోగాలను మోపి, బోను ఎక్కించి శిక్ష పడేలా చేయడంలో నేను నిష్ణాతురాలిని. నా జీవిత లక్ష్యం అదే’ అంటారు. కొలంబియా విశ్వవిద్యా లయంలో న్యాయశాస్త్రం బోధిస్తున్న సరిత, రాజకీయాలపై తన ఆసక్తి గురించి ఇలా అన్నారు... ‘రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం వృత్తిపరమైన లక్ష్యానికి కొనసాగింపు మాత్రమే’ ‘సరిత తనను తాను భారతీయ వలసదారుల బిడ్డగా అభివర్ణించుకుంటారు’ అని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
తాజాగా...
అమెరికా మధ్యంతర ఎన్నికలలో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం జరిగిన ఎన్నికలలో డెమోక్రాట్ అభ్యర్థి లేటిషియా జేమ్స్ చేతిలో సరిత ఓడిపోయారు. ఓటమి తరువాత ‘ఎక్స్’ వేదికగా ఇలా స్పందించారు... ‘ప్రజాసేవ అంటే ప్రజలకు సేవ చేయడం మాత్రమే. ఆ పేరుతో పేరు సంపాదించుకోవడం కాదు. వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి పనిచేయడం కాదు. ఇకముందు కూడా ప్రతి పనిని అంకితభావంతో చేస్తాను. ఇతరులకు సేవ చేయడం, న్యూయార్క్‌ను మరింత సురక్షితంగా మార్చడం నా లక్ష్యం’
– యాకుబ్ పాషా


