రిపబ్లికన్ల ఓటమికి 5 కారణాలు | US Midterm Elections 2026 Results: 5 Reasons for Republicans Defeat | Sakshi
Sakshi News home page

అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు: రిపబ్లికన్ల ఓటమికి కార‌ణాలు ఇవే!

Nov 5 2026 1:23 PM | Updated on Nov 5 2026 2:15 PM

US Midterm Elections 2026 Results: 5 Reasons for Republicans Defeat

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు అధికార డెమొక్రాటిక్ పార్టీకి తీవ్ర నిరాశ క‌లిగించాయి. అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల‌తో విసిగిపోయిన అమెరికా ప్ర‌జ‌లు ప్రతిపక్ష డెమొక్రాట్‌ పార్టీకి భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. ఫ‌లితంగా రిపబ్లికన్ల కంచుకోట‌లుగా ఉన్న ప‌లు కీల‌క‌ రాష్ట్రాల్లోనూ డెమొక్రాట్లు పాగా వేశారు. యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌తోపాటు సెనేట్‌లోనూ డెమొక్రాట్లు ఆధిక్యం సాధించారు. జీవన వ్యయం భారం కావ‌డంతో పాటు ప‌లు కార‌ణాల‌తో రిపబ్లికన్లు ఓటమిపాల‌య్యారు.  

1.పెరిగిపోయిన జీవన వ్యయం... 
అమెరికన్‌ ఓటర్లు నిత్యావసరాల ధరల పెరుగుదలను ఏమాత్రం సహించరు. ఈ విషయమే మధ్యంతర ఎన్నికల సమయంలోనూ స్పష్టంగా వ్యక్తమైంది. ద్రవ్యోల్బణం కారణంగా తాము బాగా ఇబ్బంది పడుతున్నామని దాదాపు 79 శాతం మంది ఓటర్లు స్పష్టం చేశారు. సెప్టెంబ‌ర్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 3.7 శాతానికి చేరుకుంది. పెట్రోలు ధరలు మునుపెన్నడూ లేనంతగా గ్యాలన్‌కు 6.52 డాలర్లకు చేరుకోవడం... ఇందుకు ట్రంప్‌ విధానాలే కారణమని 60 శాతం మంది ఓటర్లు విశ్వసించడం మరో కారణం. 

2. ఇరాన్‌తో యుద్ధం... 
ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడులకు దిగడం ఓటర్లకు ఏమాత్రం రుచించలేదు. యుద్ధాలకు దూరంగా ఉంటానని, అమెరికా ఫస్ట్‌ అని హామీలిచ్చి అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో చాలామంది మద్దతుదారులు ట్రంప్‌కు దూరమయ్యారు. ఇరాన్‌తో యుద్ధం సరైన నిర్ణయం కాదని సుమారు 63 శాతం మంది ఓటర్లు స్పష్టం చేయడం గమనార్హం.

3. కీలకాంశాలపై డెమొక్రాట్ల దృష్టి... 
ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఆరోగ్యం, అవినీతి, కుటుంబాల ఆర్థిక సమస్యలవంటి అంశాలపై ఒక పద్ధతి ప్రకారం స్పష్టమైన ప్రచారం చేశారు. ఫలితంగా టెక్సస్, కాన్సస్, సౌత్‌ కరోలినా, జార్జియా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ల ఆధిపత్యాన్ని సమర్థంగా ఎదుర్కొగలిగారు. విజయం సాధించారు.  

ఇదీ చ‌ద‌వండి: అమెరికాలో నీలి సునామీ

4. ట్రంప్‌ వైఖరి...
ఈ ఎన్నికలను అధ్యక్షుడిగా తన రెఫరెండంగా పరిగణించాలన్న డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలు ఓటర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఆర్థిక సమస్యల గురించి ట్రంప్‌కు ఏమాత్రం పట్టనట్టుగా ఉందని భావించారు. ప్రచారం సమయంలోనూ ట్రంప్‌ తన బాధలే చెప్పుకుంటున్నట్టుగా ఓటర్లు భావించారు.  

5. డెమొక్రాట్లకు మళ్లీ బ్లాక్స్‌ మద్దతు.. 
2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు ఆధిక్యం సాధించడం వెనుక హిస్పానిక్, బ్లాక్స్‌ పాత్ర సుస్పష్టం. కానీ మధ్యంతర ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. హిస్పానిక్స్‌ ఎక్కువగా ఉన్న కౌంటీల్లో దాదాపు 22 శాతం మంది డెమోక్రాట్లకు మద్దతుగా నిలిచినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇమ్మిగ్రేషన్, పౌర హక్కుల విషయంలో ప్రభుత్వం వైఖరి, ఆర్థిక ఇబ్బందులు హిస్పానిక్స్‌తోపాటు బ్లాక్స్‌ను కూడా మళ్లీ డెమోక్రాట్లకు ఓటేసేలా చేసిందని అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement