ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సిటీ బ్యాంక్ కార్యాలయ సముదాయంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టాంపా సమీపంలోని బ్రాండన్ ప్రాంతంలో ఉన్న బ్యాంక్ క్యాంపస్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మృతుల్లో అనుమానిత షూటర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ కార్యాలయం భారీగా పోలీసు బలగాలను మోహరించింది. 360 మందికి పైగా డిప్యూటీలను అక్కడికి పంపించింది. భవనాల్లో ఉన్న ఉద్యోగులను అధికారులు బయటకు పంపించారు. ఈ ఘటనను వ్యూహాత్మకంగా జరిపిన దాడిగా భావిస్తున్నట్లు షెరీఫ్ చాడ్ క్రోనిస్టర్ తెలిపారు. భవనంలో తనిఖీలు చేపట్టి ముప్పును తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. స్థానికులకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
కాల్పుల నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? అనే విషయం వెంటనే తెలియరాలేదు. బ్రాండన్‌లోని సిటీ బ్యాంక్ క్యాంపస్‌లో మూడు అంతస్తులున్న నాలుగు భవనాలు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఘటనపై సిటీ గ్రూప్ స్పందిస్తూ.. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు వెల్లడించింది.


