అమెరికా ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
జ్ఞానేశ్ కుమార్ లేకపోవడం వల్లే ట్రంప్ పార్టీ ఓడిపోయిందని ఎద్దేవా
న్యూఢిల్లీ: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పార్టీ పరాజయం పాలయ్యింది. డెమొక్రాటిక్ పార్టీ పైచేయి సాధించింది. జ్ఞానేశ్ కుమార్ అమెరికాలో ఉండి ఉంటే అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ దుస్థితి వచ్చేదే కాదని పేర్కొంటూ ప్రతిపక్ష నాయకులతో సహా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
సీఈసీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలపై రకరకాల మీమ్స్, వన్ లైనర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ‘‘అమెరికా అధ్యక్షుడికి ఒక జ్ఞానేశ్ కుమార్ చాలా అవసరం’’ అని ఒక అజ్ఞాత వ్యక్తి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘జ్ఞానేశ్ కుమార్ అమెరికాలో ఉంటే ట్రంప్‌కు ఇలా జరగనిచ్చేవారే కాదు’’ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు.
‘‘ట్రంప్ సాబ్.. మీరు జ్ఞానేశ్‌ను వెంట తీసుకెళ్లి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి చూడాల్సి వచ్చేది కాదు’’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సామాజిక కార్య కర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం స్పందించారు. ‘‘మోదీ: క్షమించు మిత్రమా, జ్ఞానేశ్ ను నీ దగ్గరకు పంపలేక పోయాను. ముందు నేను నా సంగతి చూసుకోవాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు ఇక్కడి ప్రజలు అతడిని ఇంట్లోనే బంధించేశారు.
ఇప్పుడు అతడు నాకు సహాయం చేయడానికి కూడా వీల్లేకుండా పోయంది’’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు విసిరారు. ప్రధానమంత్రి మోదీ వేచి ఉన్న గదిలోకి ట్రంప్ ప్రవేశిస్తున్నట్లుగా ఒక మీమ్‌ను మరొకరు పోస్టుచేశారు. దానికి ‘‘బ్రో.. నాకు జ్ఞానేశ్‌ను ఇవ్వు’’ అనే శీర్షిక కనిపిస్తోంది. మరో పోస్టులో ‘‘మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడం మొదలైంది. జ్ఞానేశ్ కుమార్ అమెరికాకు బయలుదేరబోతున్నారు’’ ఒక నెటిజన్ పేర్కొన్నారు.
‘‘అమెరికాలో స్వయంగా జ్ఞానేశ్ కుమార్ రంగంలోకి దిగి, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ట్రంప్ కోరుకుంటున్నారు’’ అనే మరో వ్యాఖ్య కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అమెరికా ఓటర్లు ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీకి పట్టంగట్టారు. కీలకమైన గవర్నర్ పదవులను డెమొక్రాట్లు చేజిక్కించుకున్నారు. భారత్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, అందులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పాత్రను అమెరికా ఎన్నికల ఫలితాలతో జనం ముడిపెడుతున్నారు. అక్కడ జ్ఞానేశ్ ఉంటే బాగుండేదని, ట్రంప్ పార్టీ కచ్చితంగా గెలిచేదని ఎద్దేవా చేస్తున్నారు.


