మీరు తప్పు నెంబర్‌కు డయల్ చేస్తున్నారు
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల రొటేషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ సరదా వ్యాఖ్య
న్యూఢిల్లీ: ‘‘మీరు తప్పు నెంబర్‌కు డయల్ చేస్తున్నారు. ఇది ధర్నాలు, నిరసనలు చేసే సమయం. మీరు కూడా చేయండి’’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సరదాగా వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను తప్పనిసరిగా రొటేషన్ పద్ధతిలో కేటాయించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జగదీష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది.
పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీలు) కోసం రిజర్వ్ చేసిన నియోజకవర్గాలను రొటేషన్ చేయకపోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే, ఇటువంటి నిర్ణయాలు శాసనసభ పరిధిలోకి వస్తాయని, వాటిపై న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించలేదు. డీలిమిటేషన్ చట్టం–2002లోని సెక్షన్ 9(1)(సీ)ని సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఈ సెక్షన్ ఎస్సీ/ఎస్టీ జనాభా నిష్పత్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రిజర్వ్‌డ్ నియోజకవర్గాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ‘‘ఒక రాజకీయ ప్రజాస్వామ్యంలో, భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి. ఓటర్లు మతాన్ని బట్టి కాకుండా, పార్టీని బట్టి ఓటు వేయాలని ఆశిస్తారు. మీకు ఒక నిర్దిష్ట రాజకీయ సిద్ధాంతం నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు; కానీ ఆ సిద్ధాంతానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది అప్రస్తుతం. మీరు ఓటు వేసేది ఆ సిద్ధాంతానికే’’ అని ధర్మాసనం సభ్యుడు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ పేర్కొన్నారు.


