కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు | Supreme Court issues notice to Centre, ECI on plea over Section 16 | Sakshi
Sakshi News home page

కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

Nov 4 2026 5:21 PM | Updated on Nov 4 2026 5:27 PM

Supreme Court issues notice to Centre, ECI on plea over Section 16

సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్ , ఇతర ఎన్నికల కమిషనర్లకు విధి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపై జీవితకాలం న్యాయపరమైన చిక్కుల నుంచి రక్షణ కల్పించేలా తెచ్చిన 2023 చట్టంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఆ చట్టంలోని సెక్షన్‌ 16పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

2023 ప్రధాన ఎన్నికల కమిషనర్ చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాంగ విరుద్ధమని సవాల్ చేస్తూ ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ పిటిషన్‌పై భారత ప్రధాన జస్టిస్‌  జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జయమాల్యా బాగ్చి, జస్టిస్‌ వి. మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది అరుణ్ కుమార్ అగ్రవాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఆయన తరఫున న్యాయవాది నేహా రాథీ వాదనలు వినిపించారు.

2023 చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం.. సీఈసీ, ఈసీలుగా పనిచేస్తున్న, పదవీ విరమణ పొందిన అధికారులకు, వారు తమ అధికారిక విధుల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సివిల్, క్రిమినల్ చర్యల నుంచి సంపూర్ణ రక్షణ కల్పించబడింది. అయితే, ఈ నిబంధనను సవాల్ చేస్తూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.

ఎన్నికల సంఘం ఎలాంటి అనవసర జోక్యాలు లేకుండా స్వతంత్రంగా పనిచేయడానికి రక్షణ ఎంతైనా అవసరమని, అయితే దానిని అడ్డంపెట్టుకుని వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా బ్లాంకెట్ బార్ విధించడం సరికాదని పిటిషనర్ వాదించారు.

ఇతర రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులకు వర్తించే విధంగా  సదుద్దేశం అనే ప్రాథమిక పరిమితి కూడా లేకుండా ఇలా షరతులు లేని జీవితకాల రక్షణ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

ఈ పిటిషన్ కేవలం చట్టపరమైన నిబంధనలకే పరిమితం కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వెలుగుచూసిన కొన్ని అంశాలను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ భద్రత, సమగ్రతపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై మీడియాలో వచ్చిన కథనాలను పిటిషన్‌లో ఉదహరించారు.

అంతేకాకుండా, ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కేరళ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా పనిచేసిన కాలం నాటి కొన్ని ఆరోపణలు, ఆయన నిర్వహణ శైలిపై కూడా తీవ్ర ప్రశ్నలు తలెత్తినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, అధికారులు సదుద్దేశంతో చేయని పనులకు కూడా ఇలా రక్షణ కల్పించడం సమంజసమేనా అని ప్రశ్నిస్తూ.. 2023 చట్టంలోని సెక్షన్ 16ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఈసీఐకి నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తదుపరి విచారణలో కేంద్రం, ఎన్నికల సంఘం ఎలాంటి సమాధానం ఇస్తాయన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement