డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వా (Canva) సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ మెలానీ పెర్కిన్స్ కంపెనీ ఉద్యోగులకు భారీ షాకిచ్చారు. సంస్థ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతలను బుధవారం ప్రకటించారు. కంపెనీలో చేపడుతున్న పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం సిబ్బందిలో దాదాపు 22 శాతం మందిని తొలగించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంపై బాధను, తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉద్యోగుల కాసిన ఒక లేఖలో ఆమె క్షమాపణలు కోరారు. ఇటీవలి కాలంలో టెక్ పరిశ్రమలో అనేక కఠినమైన లే-ఆఫ్ ప్రకటనలు విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో... పెర్కిన్స్ చూపించిన బాధ్యత, సానుభూతి , ఉద్యోగులకు మద్దతు ఇచ్చే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషంగా నిలిచింది.
13 ఏళ్ల చరిత్రలో ఇది కఠిన నిర్ణయం
తమ కంపెనీ పదమూడేళ్ల చరిత్రలోనే అత్యంత కఠినమైన నిర్ణయం అని పెర్కిన్స్ అభివర్ణించారు. కాన్వా నిర్ణయం 1,271 మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుంది. ఉద్యోగులకు పంపిన లేఖలో, వేగంగా మారుతున్న సాంకేతిక మార్పులు, నెమ్మదించిన వ్యాపార వృద్ధి మధ్య కాన్వాను తదుపరి దశ వైపు నడిపించడంపై నెలల తరబడి సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెర్కిన్స్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక తాము ఎంతో ఆదరించే వ్యక్తులు ఉన్నారు అంటూ దీని పరిణామాలు ప్రభావిత ఉద్యోగులు, వారి కుటుంబాలు, సహోద్యోగులపై అత్యంత నిజమైన ప్రభావం చూపుతాయని ఆమె అంగీకరించారు. చిన్నచిన్న మార్పులు ఇకపై సరిపోవని కాన్వా ఒక స్థితికి చేరుకుందని పెర్కిన్స్ స్పష్టం చేశారు. తొలగించబడుతున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ లే-ఆఫ్స్ వారి ప్రతిభకు లేదా పనితీరుకు సంకేతం కాదని ఆమె స్పష్టం చేశారు.
అంతేకాదు నిర్ణయాలు ఆయా ఉద్యోగుల ప్రతిభను, వారు అందించిన విలువైన సహకారాన్ని ఏమాత్రం తగ్గించవని గ్రహించాలని ఆమె కోరారు. ఈ రోజు కాన్వా ఈ స్థాయిలో ఉందంటే అది మీ కష్టం, సృజనాత్మకత, ఉత్సాహం. శ్రద్ధ ఫలితమే అంటూ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొనడం విశేషంగా నిలుస్తోంది.
తొలగించిన ఉద్యోగులకు భారీ ప్యాకేజీ
అలాగే తొలగించిన ఉద్యోగుల కోసం కనీసం 6 నెలల వేతనం, ఆరోగ్య సంరక్షణ , స్టార్టప్ గ్రాంట్లు సహా భారీ సహాయ ప్యాకేజీని ఆమె ప్రకటించారు బాధితులైన ఉద్యోగులు ఎక్కడ ఉన్నప్పటికీ, వారికి కనీసం ఆరు నెలల జీతం (చట్టబద్ధమైన హక్కులతో కలిపి) అందుతుంది. గడిచిన సంవత్సరంలో చేరిన ఉద్యోగుల కోసం 'వన్-ఇయర్ వెస్టింగ్ క్లిఫ్' నిబంధనను తొలగించారు.వీలైన చోట ఆరోగ్య బీమా కవరేజీని 12 నెలల పాటు పొడిగిస్తున్నారు. ఎంప్లాయ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఒక సంవత్సరం పాటు కౌన్సెలింగ్ సేవలు అందిస్తారు. ఇంకా వన్-టు-వన్ కెరీర్ కోచింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లింక్డ్‌ఇన్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు ,ఇన్వెస్టర్లు, పరిశ్రమ నిపుణులతో పంచుకునే అలుమ్ని టాలెంట్ నెట్‌వర్క్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. అలాగే కొంతమంది ఉద్యోగులు తమకు ఇచ్చిన వర్క్ మ్యాక్‌బుక్‌లను (MacBooks) తమ వద్దే ఉంచుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులు స్వంతంగా వ్యాపారం లేదా కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలనుకుంటే వారికి సుమారు 8.3 లక్షల రూపాయలు గ్రాంట్ అందించడానికి 'కాన్వా కలెక్టివ్ ఫండ్'ను ప్రారంభిస్తున్నారు.
ఇదీ చదవండి: ఫస్ట్ ఏసీలోనే నగలు,నగదు చోరీ మహిళ ఆగ్రహం : స్పందించిన రైల్వే
లింక్డ్‌ఇన్ యూజర్ల ప్రశంసలు
కాన్వా సీఈవో లేఖ లింక్డ్‌ఇన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సాధారణంగా కంపెనీలు ఇచ్చే రూటిన్ లే-ఆఫ్ ప్రకటనలతో పోలిస్తే ఈ లేఖ ఉన్న తీరు చాలా భిన్నంగా ఉందని కొంతమంది యూజర్లు కొనియాడారు. కాన్వా మహిళా వ్యవస్థాపకురాలి నుండి వచ్చిన ఈ మాస్ లే-ఆఫ్ మెమో టోన్ సాధారణంగా మనం చూసే లే-ఆఫ్ మెమోల కంటే చాలా భిన్నంగా ఉంది. దీనిని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను" అని ఒక యూజర్ రాశారు. తీసుకోవాల్సినంత కఠినమైన నిర్ణయాన్ని నిజంగా అంతే బాధ్యతతో తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇతర కంపెనీలు కూడా దీనిని గమనిస్తాయని ఆశిస్తున్నా అని మరొకరు కమెంట్ చేశారు.


