రూ.2 కోట్ల లంచం.. జ్ఞానేశ్ కుమార్‌పై విచారణకు ఆదేశాలు! | Election Commissioner Gyanesh Kumar ordered to investigate Allegations | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్ల లంచం.. జ్ఞానేశ్ కుమార్‌పై విచారణకు ఆదేశాలు!

Nov 4 2026 11:04 AM | Updated on Nov 4 2026 11:09 AM

Election Commissioner Gyanesh Kumar ordered to investigate Allegations

తిరువనంతపురం: కేరళలో అప్పటి పీడబ్ల్యూడీ కార్యదర్శి, ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన లంచం ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో రూ.17 కోట్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించి రూ.2 కోట్ల లంచం అడిగినట్లు ఓ మాజీ కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితల విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (వీఏసీబీ)తో ప్రాథమిక విచారణ జరిపించాలని ఆదేశించారు.

కొల్లాం జిల్లాలోని చడయమంగళంకు చెందిన సాజన్ అనే కాంట్రాక్టర్ విజిలెన్స్ విభాగానికి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టు (కేఎస్‌టీపీ) కింద తాము పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడానికి అప్పట్లో పీడబ్ల్యూడీ కార్యదర్శిగా ఉన్న జ్ఞానేశ్ కుమార్ రూ.2 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఇంజినీర్లు ఇప్పటికే ఆమోదించిన సుమారు రూ.17 కోట్ల విలువైన బిల్లుల చెక్కులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని సాజన్ పేర్కొన్నారు. దీంతో మలేసియాకు చెందిన పీఏటీఐ- బెల్‌ కంపెనీ, అందులో పనిచేసే కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఫిర్యాదులో తెలిపారు.

కంపెనీ ప్రాజెక్టు ఇంజినీర్, మలేసియా పౌరుడు లీ సీ బీన్ ఈ విషయాన్ని తనకు చెప్పారని సాజన్ వెల్లడించారు. లంచం డిమాండ్ నెరవేరే వరకు చెక్కులు విడుదల చేయడానికి జ్ఞానేశ్ కుమార్ నిరాకరించారని లీ తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే కంపెనీ అధికారులు లంచం ఇచ్చి చెక్కులు తీసుకోవడానికి అంగీకరించలేదని ఫిర్యాదులో వివరించారు. ఈ వ్యవహారంలో మరో కీలక ఆరోపణ కూడా ఉంది. బిల్లుల చెల్లింపులో జాప్యం, లంచం డిమాండ్ కారణంగా లీ సీ బీన్ 2006లో ఆత్మహత్య చేసుకున్నారని సాజన్ ఆరోపించారు. తన సూసైడ్ నోట్‌లో జ్ఞానేశ్ కుమార్ పాత్రను ప్రస్తావించినట్లు లీ కుటుంబ సభ్యులు కంపెనీ ఉద్యోగులకు తెలిపారని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

గతంలో లీ మరణం అనంతరం 2006లోనే ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. అయితే ఆరోపణలకు ఆధారాలు లభించకపోవడంతో తదుపరి చర్యలు తీసుకోకుండానే విచారణను నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి విచారణలో తనను, ఇతర కీలక సాక్షులను ప్రశ్నించలేదని సాజన్ తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. అవసరమైతే లీ కుటుంబ సభ్యులు, కంపెనీ మాజీ ఉద్యోగులు, ఇతర సాక్షులను విచారణకు హాజరుపరుస్తానని తెలిపారు.

తాజా ఫిర్యాదుపై ప్రాథమిక పరిశీలన చేసిన విజిలెన్స్ విభాగం కేసు నమోదు చేసేందుకు హోంశాఖ అనుమతి కోరింది. న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్న అనంతరం హోంమంత్రి విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టులో భాగంగా ఎంసీ రోడ్డు విస్తరణ పనుల్లో అవినీతి జరిగిందన్న మరో ఫిర్యాదుపైనా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అక్టోబర్ 4న కాంగ్రెస్ నేత మలయింకీజ్ వేణుగోపాల్ ఫిర్యాదుతో ఈ విచారణకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ప్రతిపక్షాలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను విమర్శిస్తూ నిరసనలు తెలుపుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

ఇదీ చదవండి: 2026 ఏడాది పదంగా ‘మొగ్గింగ్’.. అర్థం ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement