న్యూఢిల్లీ: నీట్ పీజీ, నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న పర్సంటైల్ ఆధారిత విధానానికి బదులుగా ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కొత్త విధానం అమల్లోకి వస్తే అభ్యర్థుల ఫలితాల్లో పర్సంటైల్ మార్కులను ప్రకటించకుండా కేవలం ర్యాంకులను మాత్రమే వెల్లడించనున్నారు.
నీట్ పీజీ ప్రవేశాలు, కౌన్సెలింగ్ ప్రక్రియను సమీక్షించేందుకు ఏర్పాటైన 12 మంది సభ్యుల నిపుణుల కమిటీ మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. కొత్త నిబంధనల రూపకల్పనపై ఎన్‌ఎంసీ కసరత్తు చేస్తోందని పేర్కొంది. సెప్టెంబర్ 23న జరిగిన కమిషన్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. అక్టోబర్ 1న ఎన్‌ఎంసీ కార్యదర్శి డీజీహెచ్‌ఎస్‌కు ఈ మేరకు లేఖ రాశారు. అయితే కొత్త నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు.
నీట్ పీజీ 2025 అర్హత పర్సంటైల్‌ను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. జనరల్ కేటగిరీ అర్హత మార్కులను 276 నుంచి 103కు తగ్గించగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు 235 నుంచి మైనస్ 40కు తగ్గించారు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించింది.
అదే సమయంలో పీజీ వైద్య విద్యలో కనీస అర్హత ప్రమాణాలను మరీ తగ్గించకూడదని కమిటీ సూచించింది. తగిన ప్రతిభ లేని, నెగెటివ్ మార్కులు సాధించిన అభ్యర్థులు కూడా ప్రవేశాలకు అర్హత పొందే పరిస్థితి రాకూడదని స్పష్టం చేసింది. పోటీ పరీక్షల ప్రాధాన్యతను కేవలం పరిపాలనా ప్రక్రియగా మార్చకూడదని అభిప్రాయపడింది. ఇక వైద్య విద్యలో క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో పనిచేసే రెసిడెంట్ వైద్యులకు జీతాల్లో వివక్ష ఉండకూడదని కమిటీ సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కూడా సిఫారసు చేసింది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 33 మంది మృతి


