మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ వైమానిక దాడికి పాల్పడింది. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతం కొమిషువాఖాలో పౌరులు ఆశ్రయం పొందుతున్న భవనంపై తొమ్మిది బాంబులు వేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 33 మంది మరణించగా, మరో 50 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ దాడిని తమ యుద్ధంలోనే అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు.
యూరోపియన్ యూనియన్ నిధులతో నిర్మించిన భవనంలోని బలమైన భూగర్భ గదిలో పౌరులు ఆశ్రయం పొందుతున్నారు. యుద్ధ పరిస్థితుల్లోనూ తరగతులు నిర్వహించేందుకు గత ఏడాది ఈ భవనాన్ని నిర్మించారు. అయితే యుద్ధం గ్రామానికి దగ్గర కావడంతో పాఠశాలను నిలిపివేసి, దానిని పరిపాలనా కేంద్రంగా, మానవతా సహాయ పంపిణీ కేంద్రంగా మార్చారు. బాంబుల తీవ్రతకు కాంక్రీట్ నిర్మాణం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి.
మానవతా సహాయం అందుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పౌరులు అక్కడికి చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పర్యవేక్షణ బృందం వెల్లడించింది. సహాయ పంపిణీ కార్యక్రమం గురించి ముందుగానే విస్తృతంగా ప్రచారం చేశారని ఐరాస మిషన్ అధిపతి డానియెల్ బెల్ తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా రష్యా దాడి చేసి ఉంటే, లేదా దాడికి ముందు కనీస సమాచారం సేకరించకపోయినా అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన జరిగినట్లేనని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు రష్యా ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా వందలాది డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో మరో భారీ దాడికి దిగింది. ఖ్మెల్నిట్స్కీ అణు విద్యుత్ కేంద్రం కార్యకలాపాలకు కీలకమైన సబ్‌స్టేషన్‌పై మూడు డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఇంధన మంత్రి డెనిస్ ష్మిహాల్ వెల్లడించారు. దీనివల్ల ఐరోపా వ్యాప్తంగా అణు భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంధన రంగంపై దాడులు నిలిపివేయాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చినప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్న రోజే రష్యా ఈ దాడులకు పాల్పడిందని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ గగనతల రక్షణకు అమెరికా సహాయం చేయాలని, లేకపోతే రష్యా క్షిపణి దాడులను ఆపబోదని కోరారు.
ఇటీవలి నెలల్లోనూ ఉక్రెయిన్‌లో పౌరులపై అనేక దాడులు జరిగాయి. గత నెలలో డొనెట్స్క్ ప్రాంతంలోని క్రామటోర్స్క్‌లో రెండు పౌర బస్సులపై జరిగిన దాడిలో 33 మంది మరణించారు. ఆగస్టులో కీవ్ సమీపంలో డ్రోన్ దాడి కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలైలో కీవ్‌పై జరిగిన క్షిపణి దాడుల్లోనూ 33 మంది మరణించారు. అత్యవసర సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత రెండోసారి దాడి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: ‘మధ్యంతరం’లో ట్రంప్‌కు షాక్.. డెమోక్రాట్ల జోరు!


