వాషింగ్టన్: అమెరికాలో 2026 మధ్యంతర ఎన్నికలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన రెండేళ్ల పాలనపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్‌పై ఆధిపత్యం కోసం రిపబ్లికన్లు, డెమోక్రాట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నారు.
ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతినిధుల సభను కైవసం చేసుకోవాలంటే డెమోక్రాట్లు కనీసం మూడు స్థానాలు, సెనేట్‌లో ఆధిపత్యం సాధించాలంటే నాలుగు స్థానాలు అదనంగా గెలుచుకోవాలి. అయితే పలు సర్వేలు ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు ఆధిక్యం లభించే అవకాశాలున్నాయని సూచిస్తున్నాయి. దాంతో సెనేట్ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇక మరోవైపు ఇరాన్‌తో యుద్ధం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం 3.7 శాతానికి చేరింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధికార అధ్యక్షుడి పార్టీకి మెజారిటీ కోల్పోయిన సందర్భాలే ఎక్కువ.
కాంగ్రెస్‌లో రెండు సభలపై రిపబ్లికన్లు పట్టు కోల్పోతే తన నిర్ణయాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ట్రంప్ అంగీకరించారు. అయితే అలాంటి పరిస్థితి వస్తే అధ్యక్షుడి వీటో అధికారాన్ని కూడా ఉపయోగిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. ఇద్దరు ట్రెక్కర్ల మృతి


