కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. హాలోవీన్ వస్తువులు విక్రయించే స్పిరిట్ హాలోవీన్ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో ఒక గర్భిణి ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 17 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కాలిఫోర్నియాలోని ఫెయిర్‌ఫీల్డ్ నగరంలో ఉన్న సోలానో టౌన్ సెంటర్ మాల్‌లో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడి స్పిరిట్ హాలోవీన్ స్టోర్‌లోకి ప్రవేశించిన యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 31 ఏళ్ల కాన్‌స్టాన్స్ హేజెస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఫెయిర్‌ఫీల్డ్ పోలీస్ విభాగం ప్రజా సమాచార అధికారి మిచెల్ బెలీయా తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు స్టోర్‌లోకి వెళ్లిన తర్వాత అక్కడున్న ఓ కస్టమర్‌ను గుర్తించాడు. ఆ వ్యక్తినే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు గాయపడ్డారు. వారిలో నలుగురు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. మిగిలిన ఇద్దరికి చికిత్స అందించిన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించారు. అనంతరం ఫెయిర్‌ఫీల్డ్ సమీపంలోని సుయిసన్ సిటీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ కావడంతో అతడి పేరును పోలీసులు వెల్లడించలేదు. మృతురాలు కాన్‌స్టాన్స్ హేజెస్ గర్భిణి కావడంతో నిందితుడిపై మరో హత్య అభియోగం కూడా మోపే అవకాశం ఉందని ఫెయిర్‌ఫీల్డ్ పోలీస్ చీఫ్ డాన్ మార్షల్ తెలిపారు. నిందితుడు 2025లో ఓ కేసులో దోషిగా తేలి, కొన్ని నెలలపాటు జువెనైల్ నిర్బంధ కేంద్రంలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత విడుదలయ్యాడని తెలిపారు. యువ నేరస్థుల విషయంలో కాలిఫోర్నియా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోలీస్ చీఫ్ డాన్ మార్షల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Oman: భారత నౌకపై దాడి.. భారత నావికుడు మృతి!


