న్యూయార్క్: హాలోవీన్ వేడుకల్లో వినూత్న వేషధారణతో అందరినీ ఆశ్చర్యపరిచే సూపర్ మోడల్ హెడీ క్లమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2026 హాలోవీన్ పార్టీ సందర్భంగా తన ఎడమ చేతికి భారీ ప్రతిరూపంలా కనిపించే వింత కాస్ట్యూమ్ ధరించి వేడుకకు హాజరయ్యారు. తెగిపోయిన చేతిలా కనిపించే ఈ వేషధారణలో ఎరుపు రంగు గోళ్లతోపాటు నరాలు, కండరాలు, మణికట్టు వంటి వివరాలను అత్యంత సహజంగా రూపొందించారు.
ఈ కాస్ట్యూమ్ ప్రత్యేకత ఏమిటంటే.. అది ఎవరో ఒకరి చేయి కాదు. అచ్చం తన చేతిలాగే ఉండాలని హెడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందుకోసం ఆమె శరీర స్కాన్లను ఉపయోగించారు. ఆమె ధరించే నిశ్చితార్థపు ఉంగరం, వివాహ ఉంగరం, వేలిపై ఉన్న చిన్న పచ్చబొట్టును కూడా ప్రతిరూపంలో చేర్చారు. ఈ పనిని స్పెషల్ ఎఫెక్ట్స్ కళాకారుడు మైక్ మారినో నేతృత్వంలోని ప్రోరెన్‌ఎఫ్ఎక్స్ బృందం చేపట్టింది.
2026 HALLOWEEN Costume WINNER by Heidi Klum🔥. NOTHING BEATS this🙆♀️ https://t.co/iWLwoMOU9H
— Crime Time Chronicles (@crimetimechron) November 1, 2026
ఈ ఆలోచన హెడీకి ఏడాది క్రితమే వచ్చిందట. సాధారణంగా కనిపించే మనిషి చేతిని అసాధారణమైన రూపంలో చూపించాలన్నది ఆమె ఉద్దేశం. ఈ కాస్ట్యూమ్ తయారీకి నెలల సమయం పట్టగా, సిద్ధమవడానికి ఆమె సుమారు ఆరు గంటలు కేటాయించారు. భారీ చేతిలో ఆమె ఎలా ఉండాలి? ఎలా కదలాలి? అనే అంశాలపైనా ప్రత్యేకంగా పనిచేశారు.
గతంలో భారీ పురుగు, నెమలి, ఈటీ, మెడూసా వంటి విభిన్న వేషధారణలతో హెడీ క్లమ్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 2022లో ధరించిన భారీ పురుగు కాస్ట్యూమ్ ఇప్పటికీ అభిమానులకు గుర్తుంది. ఈ ఏడాది ఆమె ప్రయోగంపై కూడా సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె నిర్వహిస్తున్న వార్షిక హాలోవీన్ పార్టీకి ఈసారి 25 ఏళ్లు పూర్తవడం మరో విశేషం. అందంగా కనిపించడం కంటే కొత్తగా భయపెట్టడానికే తాను ప్రాధాన్యమిస్తానని హెడీ మరోసారి నిరూపించారు.
ఇదీ చదవండి: హాలోవీన్ వేళ యూరప్‌లో జెన్‌జీ నిరసనల సెగ


