కాఠ్మాండూ: నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. మూడు గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. తొలి భూకంపం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో, రెండోది 4.2 తీవ్రతతో నమోదైంది.
నేషనల్ సిస్మోలాజికల్ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:51 గంటలకు తొలి భూకంపం నమోదైంది. దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు వెల్లడించింది. అనంతరం మూడు గంటల్లోపే మరోసారి భూమి కంపించింది. ఉదయం 4:28 గంటలకు 4.2 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా ముగు జిల్లాలోని కలీయీ ప్రాంతం పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పొరుగున ఉన్న డోల్పా, జుమ్లా జిల్లాలనూ తాకాయి.
ఇదిలా ఉండగా.. ఆగస్టు 26న నేపాల్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం నాటికి ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,399కి పెరిగినట్లు అధికారులు తెలిపారు. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, రాళ్లు జారిపడటంతో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని పట్టణాలు, గ్రామాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
ఇదీ చదవండి: దిశా మృతి కేసు దర్యాప్తు.. ఎవరీ సీమా పాహుజా?


