కుప్పకూలిన భవనం.. నిద్రలోనే 16 మంది మృతి | Building collapse in Gaza kills 16 | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన భవనం.. నిద్రలోనే 16 మంది మృతి

Sep 16 2026 3:58 PM | Updated on Sep 16 2026 4:47 PM

Building collapse in Gaza kills 16

గాజా సిటీలో బుధవారం తెల్లవారుజామున ఓ భవనం కూలిపోవడంతో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 12 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రతినిధి జాహెర్ అల్ వహీది తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

కూలిపోయిన భవనంలో సుమారు 6 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా భవనం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిని, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తెలిసినా.. అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని గాజా పౌర రక్షణ సిబ్బంది తెలిపారు. “ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో వారికి మరో మార్గం లేకుండా పోయింది” అని సహాయక సిబ్బంది అబౌద్ మజ్దలావి పేర్కొన్నారు.

భవనం కూలిన వెంటనే స్థానికులు తమ కుటుంబ సభ్యుల కోసం శిథిలాల్లో గాలించారు. కొందరు సహాయక సిబ్బందితో కలిసి శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ దుమ్ముతో నిండిన దుప్పట్లు, శిథిలాలు మాత్రమే కనిపించాయి.

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి దాదాపు ఏడాది అవుతున్నా గాజాలో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. గాజాలోని సుమారు 2 కోట్ల మంది జనాభా ప్రస్తుతం భూభాగంలో సగం కంటే తక్కువ ప్రాంతంలోనే జీవిస్తున్నారు. ఇజ్రాయెల్ దళాల చుట్టుముట్టిన పరిస్థితుల్లో వారు సహాయ సామగ్రిపై ఆధారపడుతున్నారు. హమాస్ ఆయుధాలు విడిచే వరకు పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వబోమని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 73,789 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 1,375 మంది మరణించినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement