ఒళ్లు గగుర్పొడిచే ఘటన అలాస్కా తీరంలో జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. చిన్న పడవ ఒక్కసారిగా సముద్రంలో బోల్తా పడటంతో 15 ఏళ్ల డెరిక్ పార్కర్ అఘ్నాంగ తన అన్న, కజిన్‌ను కోల్పోయాడు. అయితే ప్రాణాలతో బయటపడేందుకు దాదాపు మూడు రోజుల పాటు సముద్రంలో మంచు గడ్డలతో పోరాటం చేశాడు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఘటన జరగ్గా, సుమారు 62 గంటల తర్వాత డెరిక్‌ను రక్షించారు.
పడవ బోల్తా పడిన తర్వాత డెరిక్‌తో పాటు అతని అన్న, కజిన్ సముద్రంలో పడిపోయారు. కొంతసేపు ముగ్గురూ ఒకరికొకరు దగ్గరగా ఉండగలిగారు. అయితే పరిస్థితులు మరింత విషమించడంతో అతని అన్న, కజిన్ మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారు తన నుంచి దూరంగా కొట్టుకుపోకుండా ఉండేందుకు డెరిక్ తన అన్న, కజిన్ మృతదేహాలను సాధ్యమైనంత ఎక్కువసేపు పట్టుకుని ఉండేందుకు ప్రయత్నించాడు. చివరకు బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా వారిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో అతను ఒంటరిగా సముద్రంలో మిగిలిపోయాడు.
పడవలోని చేపల వేటకు ఉపయోగించే ఓ లైన్.. ఇంజిన్‌లో చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. దాన్ని విడిపించేందుకు వారు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. అనంతరం వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో పడవ బోల్తా పడింది. పడవ తిరగబడటంతో అందరూ గడ్డకట్టేంత చల్లని సముద్రంలో పడిపోయారు. కొన్ని గంటలకు డెరిక్ అన్న, కజిన్ మృతి చెందారు. అయినప్పటికీ డెరిక్ వారిని వదలకుండా వీలైనంత వరకు పట్టుకుని ఉన్నాడు. సాయం అందుతుందనే ఆశతో సముద్రంలోనే పోరాడాడు.
సెప్టెంబర్ 7 ఉదయం అమెరికా కోస్ట్ గార్డ్ బృందం బోల్తా పడిన పడవను గుర్తించింది. అది సెయింట్ లారెన్స్ ద్వీపానికి తూర్పున సుమారు నాలుగు మైళ్ల దూరంలో ఉంది. అధికారులు ముందుగా డెరిక్‌కు అవసరమైన ప్రాణరక్షణ సామగ్రిని అందించారు. అనంతరం సమీపంలోని నౌక అతడిని రక్షించింది.
అప్పటికే డెరిక్ తీవ్ర హైపోథర్మియాతో బాధపడుతున్నాడు. శరీరంలో నీరు తీవ్రంగా తగ్గిపోయి.. చలికి గురై అతని పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికీ అతను శ్వాస తీసుకుంటూనే ఉన్నాడు. వెంటనే అత్యవసర చికిత్స కోసం అతడిని వైద్య కేంద్రానికి తరలించారు. డెరిక్ అత్త కొలీన్ వాకర్ గోఫండ్‌మీ పేజీలో ఈ విషాద ఘటన వివరాలను వెల్లడించారు. తన అన్న, కజిన్ మునిగిపోయిన తర్వాత వారిని సాధ్యమైనంత ఎక్కువసేపు పట్టుకుని ఉండేందుకు డెరిక్ ప్రయత్నించాడని ఆమె తెలిపారు.


