అలాస్కాలోని బెరింగ్ సముద్రంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. చుట్టూ గడ్డకట్టేంత చలి ఉన్న సముద్రం.. తినడానికి ఆహారం, తాగడానికి నీరు లేకపోయినా 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల పాటు బోల్తాపడిన చేపల వేట పడవపైనే ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో బాలుడి అన్న, మరో బంధువు మృతి చెందారు. బాధిత బాలుడిని డెరిక్ పార్కర్ అఘ్నాంగా గా గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. డెరిక్, అతడి అన్న, మరో బంధువు కలిసి చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు.
అమెరికా కోస్ట్‌గార్డ్ వివరాల ప్రకారం.. డెరిక్ కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 4న సెయింట్ లారెన్స్ ద్వీపం నుంచి 18 అడుగుల చేపల వేట పడవలో బయలుదేరారు. అయితే, ఆదివారం మధ్యాహ్నానికి తిరిగి రావాల్సి ఉండగా వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గాలింపు కొనసాగుతుండగా బోల్తాపడిన పడవపై కూర్చున్న డెరిక్ వారికి కనిపించాడు.
ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలో ఉన్న మరో చేపల వేట పడవ సిబ్బంది అతడి వద్దకు చేరుకుంది. అతడిని సురక్షితంగా తమ పడవలోకి తీసుకున్నారు. అదే సమయంలో సముద్రంలో గాలింపు కొనసాగించగా డెరిక్ అన్న, మరో బంధువు మృతదేహాలు లభించాయి. ఈ రెండు రోజుల పాటు చల్లటి సముద్రంలో ఉండటంతో డెరిక్ శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. హైపోథెర్మియా లక్షణాలు కనిపించినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు తెలిపారు. సముద్రంలోని నీటి ఉష్ణోగ్రత సుమారు 10 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉన్నట్లు రక్షించిన పడవ కెప్టెన్ ఆడమ్ వైట్ చెప్పారు.
అలా.. డెరిక్ చీకట్లో కూడా బోల్తాపడిన పడవను గట్టిగా పట్టుకుని ఉన్నాడని కెప్టెన్ ఆడమ్ వైట్ తెలిపారు. చలికి అతడి పళ్లు గడగడలాడుతున్నప్పటికీ తన అన్న పడవ కింద చిక్కుకుని ఉన్నాడని చెప్పినట్లు వివరించారు. అయితే, అంతకుముందు రాత్రి తన మరో బంధువు కూడా నీటిలో జారిపోయినట్లు డెరిక్ చెప్పాడన్నారు. ఇంతటి ప్రమాదంలోనూ అతడు ధైర్యంగా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడని, డెరిక్ చాలా ధైర్యవంతుడని కెప్టెన్ ప్రశంసించారు.
డెరిక్, అతడి అన్నకు చేపలు పట్టడం అంటే ఎంతో ఇష్టమని వారి తల్లి వీనా కులోవియి తెలిపారు. అలాగే, స్థానిక దుకాణాల్లో మాంసం కొనలేని కుటుంబాలకు ఆహారం అందించేందుకు వారు చేపలు పట్టేవారని చెప్పారు. సెయింట్ లారెన్స్ ద్వీపంలోని సవూంగా గ్రామంలో సుమారు 800 మంది నివసిస్తున్నారు. అక్కడ ఎక్కువగా సైబీరియన్ యుపిక్ ప్రజలు ఉంటారు. వేటాడి ఆహారం సంపాదించడం, అవసరమైన వారికి దాన్ని పంచుకోవడం తమ కుటుంబంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని వీనా ఈ సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం డెరిక్ ఇంటికి చేరుకుని కోలుకుంటున్నాడని అతడి తల్లి చెప్పారు. సముద్రంలో ఉన్నంతసేపూ తన కుమారుడు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడని తెలిపారు. ‘‘నా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి కథ అద్భుతం. ఇంతసేపూ అతడు భయపడలేదు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా కోస్ట్‌గార్డ్ ఆర్కిటిక్ జిల్లా కమాండర్ రియర్ అడ్మిరల్ బాబ్ లిటిల్ స్పందిస్తూ.. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి కుటుంబాలు, స్నేహితులు, వారి సమాజానికి సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: ఆరేళ్ల తర్వాత స్టేజ్‌పై సెలిన్ డియోన్.. అభిమానుల్లో పండగ!


