సింగపూర్‌లో జరిగిన ఓ వింత ఘటన అందర్నీ అశ్చరపరుస్తోంది. ప్రేమలో ఉండగా ప్రేయసి కోసం ఏకంగా రూ.3.5 కోట్లు ఖర్చు చేశాడు.. విలాసవంతమైన కానుకలు, ఫస్ట్‌క్లాస్ విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనలు.. ఇలా ఆమె కోసం భారీగా ఖర్చు చేసిన భారత సంతతికి చెందిన ఓ సీఈవో.. ప్రేమ బంధం తెగిపోయిన తర్వాత ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోర్టుకెక్కాడు. కానీ న్యాయస్థానం మాత్రం ఇది ప్రేమలో ఇచ్చిన బహుమతులేనంటూ తీర్పు చెప్పింది. దీంతో డబ్బు తిరిగి రాకపోగా.. కోర్టు ఖర్చులు కూడా అతడే భరించాల్సి వచ్చింది. ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.
సీఎన్‌ఎన్ కథనం మేరకు భారత లాజిస్టిక్స్ సంస్థ టీసీఎల్ ఎక్స్‌ప్రెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ అగర్వాల్, తన మాజీ ప్రేయసి ఫెలీషియా లీ తనకు దాదాపు $3.7 లక్షలు చెల్లించాల్సి ఉందని పేర్కొంటూ సింగపూర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెపై ఖర్చు చేసిన మొత్తాన్ని తాను వడ్డీ లేని రుణాలుగా ఇచ్చానని.. వాటిని ఆమె తిరిగి చెల్లించాల్సి ఉందని అగర్వాల్ వాదించారు. అయితే కోర్టు మాత్రం ఆ మొత్తంలో ఎక్కువ భాగం బహుమతుల రూపంలో ఇచ్చినవేనని తేల్చింది. అగర్వాల్ దావాను కొట్టివేసింది.
అగర్వాల్, లీ ఇద్దరూ తొలిసారిగా 2019లో ఓ విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్‌లో వారి మధ్య ప్రేమ ఏర్పడింది. 2023 డిసెంబర్‌లో వారి సంబంధం ముగిసింది. లీ తనకు నమ్మకద్రోహం చేసిందని.. అందుకే తాము విడిపోయామని అగర్వాల్ పేర్కొన్నారు. వారు ప్రేమలో ఉండగా అగర్వాల్.. లీ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. అంతే కాకుండా.. లీ నివసించే ఫ్లాట్ కోసం ఓ ఫెంగ్ షుయ్ నిపుణుడికి సుమారు S$17,000 కూడా చెల్లించారు.
ఈ చెల్లింపు మాత్రం రుణమేనని అగర్వాల్ వాదించారు. లీ తనను డబ్బు రుణంగా ఇవ్వాలని కోరిందని.. దాన్ని తిరిగి చెల్లిస్తానని ఆమె అంగీకరించిందని అగర్వాల్ తెలిపారు. ఇందుకు ఆధారంగా లీ ఇనిషియల్స్ ఉన్నాయని తాను పేర్కొన్న ఓ చేతిరాత ఒప్పందాన్ని కూడా కోర్టుకు ఆయన సమర్పించారు. అయితే, లీ ఆ పత్రంపై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు. చెల్లింపులు రుణాలు కాదని.. బహుమతులేనని, అందువల్ల లీ ఆ డబ్బును అగర్వాల్‌కు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్‌తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ


